* తొలి ఏడాదే 2 లక్షలు ఉద్యోగాలని గద్దెనెక్కారు
* ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని ప్రజలు మరచిపోరు
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిరుద్యోగులు క్షమించబోరని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఏడాది అని, ఇప్పుడు అది ఐదేళ్ల హామీ అంటూ పీసీసీ చీఫ్‌తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోందని అన్నారు. తొలి ఏడాదేరెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు పోజులివ్వడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిందేమీ లేదన్నారు. జాబ్ క్యాలెండర్‌కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని, రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటే అని హెచ్చరించారు.
……………………………………………….
