* సాయంత్రం 6 గంటలతో ప్రచారం సమాప్తం
* నేడు తెలంగాణకు మోదీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. రేపటితో ముగియనుంది. దీంతో ఈరోజు, రేపు రోడ్‌షోలు, ర్యాలీలు, సభలతో దూకుడు పెంచేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ప్లాన్ చేశారు. ఇక బీజేపీ అగ్రనేత, ప్రధానమంత్రి మోదీ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. నేడు తెలంగాణకు మరోసారి రానున్నారు. ఒకేరోజు రెండు సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటకు చేరుకోనున్నారు. నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్‌నగర్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకుంటారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, చేవెళ్ల లోక్‌సభ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు హాజరుకానున్నారు.
అలాగే, మిగతా పార్టీల అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి ఈరోజు, రేపు కవర్ చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. కాగా, మార్చి 16న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ ప్రకటించగా.. 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుండడంతో రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. వాస్తవంగా సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలి.. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రేపు 6 గంటల వరకు ప్రచార సమయం కూడా ఓ గంట పెరిగింది.
గడువు దగ్గర పడుతుండడంతో అగ్రనేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. నిన్న సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ, మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, హర్దీప్సింగ్, అనురాగ్‌సింగ్ ఠాగూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు తమిళిసై, అన్నామళై తదితరులు ప్రచారం నిర్వహించారు. నేడు ఎల్బీ స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. మరోవైపు గులాబీ బాస్ బీఆర్ ఎస్ అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ అంతటా బస్సు యాత్ర చేపడుతున్నారు. మరోవైపు.. లోక్‌సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉండడంతో మెజార్టీ అభ్యర్థులు కుటుంబ సభ్యులను ప్రచార రంగంలోకి దించారు. భార్య, పిల్లలతోపాటు సోదరులు, ఇతర బంధువులు అభ్యర్థుల తరపున ఇంటింటికి తిరుగుతున్నారు. తమ వారికి మద్దతుగా కొందరు విదేశాల నుంచీ రావడం గమనార్హం. రెండు రోజులే సమయమున్న నేపథ్యంలో నేడు, రేపు వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. చివరి రోజు పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. ఈ రెండు రోజులూ ప్రచారహోరుతో ఆయా ప్రాంతాలు హోరెత్తనున్నాయి.
——————