Cervical Cancer Symptoms Warning
ఆకేరు న్యూస్, హన్మకొండ: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, అవగాహన లోపం కారణంగా మహిళల్లో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలను అత్యధికంగా వేధిస్తున్న సమస్య “సర్విక్స్ క్యాన్సర్” (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్). ఈ నేపథ్యంలో ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు డైరెక్టర్ డాక్టర్ అవినాష్ తిప్పాని సర్విక్స్ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు, నివారణ పద్ధతులు మరియు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
*సైలెంట్‌గా దాడి చేసే లక్షణాలు ఇవే..
చాలా మంది మహిళలు గర్భాశయ సమస్యలను సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ అవినాష్ సూచించారు.
అసాధారణ రక్తస్రావం: సాధారణ నెలసరి సమయం కాకుండా మధ్యలో బ్లీడింగ్ అవ్వడం లేదా మెనోపాజ్ (నెలసరి పూర్తిగా ఆగిపోయిన) వయసు దాటిన మహిళల్లో హఠాత్తుగా మళ్లీ రక్తస్రావం కావడం అత్యంత ప్రమాదకరమైన సంకేతం.
కలిసినప్పుడు బ్లీడింగ్: భార్యాభర్తలు శృంగారంలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం (Post-coital bleeding) జరగడం అనేది సర్విక్స్ క్యాన్సర్‌కు ప్రధాన హెచ్చరిక.
దుర్వాసనతో కూడిన ద్రవాలు: యోని నుండి అసాధారణంగా తెల్లబట్ట కావడం, అది కాస్త ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారి తీవ్రమైన దుర్వాసన రావడం గమనించాలి.
*వ్యాధి ముదిరితే వచ్చే సమస్యలు…
ప్రారంభ దశలో ఈ క్యాన్సర్ వల్ల ఎలాంటి నొప్పి ఉండదు. అందువల్లనే చాలా మంది దీనిని గుర్తించలేరు. కానీ వ్యాధి గర్భాశయ ముఖద్వారం దాటి పక్కన ఉన్న భాగాలకు మరియు నరాలకు వ్యాపించినప్పుడు:
పొత్తికడుపు (Pelvic area) మరియు నడుము భాగంలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది.
క్యాన్సర్ కణాలు లోపలి నరాలపై ఒత్తిడి తేవడం వల్ల కాళ్ల నొప్పులు మరియు కాళ్ల వాపులు వస్తాయి. ఈ లక్షణాలు వచ్చాయంటే క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌కి చేరుకుందని అర్థం.
*మారుతున్న ట్రెండ్స్ 30 ఏళ్లకే ముప్పు…
“గతంలో సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం సర్విక్స్ క్యాన్సర్ అనేది 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. ప్రస్తుత రోజుల్లో మా హాస్పిటల్‌కు 30 నుండి 40 ఏళ్ల లోపు ఉన్న యంగ్ మహిళలు కూడా సర్విక్స్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్లతో వస్తున్నారు.” అని డాక్టర్ అవినాష్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం HPV (Human Papillomavirus) అనే వైరస్. వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene) పాటించకపోవడం, చిన్న వయసులోనే పెళ్లి కావడం మరియు మారుతున్న జీవనశైలి వంటివి ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి.
*రక్షణ కవచాలు…
సర్విక్స్ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోవడానికి మరియు ప్రాథమిక దశలోనే గుర్తించడానికి అద్భుతమైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ వివరించారు.
ప్యాప్ స్మియర్ పరీక్ష (Pap Smear): పెళ్లయిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి. దీని ద్వారా క్యాన్సర్ రాకముందే (Pre-cancerous stage) కణాలలో జరిగే మార్పులను గుర్తించి 100% నయం చేయవచ్చు.
HPV వ్యాక్సిన్: క్యాన్సర్‌ను నివారించడానికి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 9 సంవత్సరాలు దాటిన బాలికల నుండి ఈ వ్యాక్సిన్ ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో ఈ క్యాన్సర్ రాకుండా 90% వరకు రక్షణ లభిస్తుంది.
*ముందస్తు జాగ్రత్తల ప్రాముఖ్యత…
వ్యాధిని మొదటి లేదా రెండవ దశలోనే (Early stages) గుర్తిస్తే చిన్న సర్జరీ లేదా తక్కువ రేడియేషన్ ద్వారా చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో నయం చేయవచ్చు. కానీ వ్యాధి బాగా ముదిరిన తర్వాత వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టమవ్వడమే కాకుండా, రేడియేషన్ మరియు కీమోథెరపీల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మహిళలు తమ ఆరోగ్య విషయాల్లో, ముఖ్యంగా ఇటువంటి రహస్య భాగాల సమస్యలపై సిగ్గుపడకుండా ముందే డాక్టర్‌ను సంప్రదించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ అవినాష్ తిప్పాని పిలుపునిచ్చారు.
