CM Revanth Reddy,Sridhar Babu Telangana High Speed Internet
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నాణ్యమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్’ (Amended BharatNet) సజావుగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టీ-ఫైబర్ (T-Fiber) ప్రాజెక్టు పురోగతి, కేంద్ర నిధుల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు.
* సత్వరమే నిధుల విడుదల ఒప్పందానికి అంగీకారం…
ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్‌కు సంబంధించి సాధ్యమైనంత త్వరగా కేంద్రంతో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకోవాలని, పెండింగ్‌లో ఉన్న నిధులను సత్వరం విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే, మండలం నుండి గ్రామ పంచాయతీ వరకు ఉన్న రింగ్ నెట్వర్క్ వ్యవస్థలను ‘డిజిటల్ భారత్ నిధి’ (Digital Bharat Nidhi) కి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కోరిన అంశాలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఆశిస్తున్న డిజిటల్ లక్ష్యాలను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
* ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ ద్వారా పనుల వేగవంతం…
అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఒక ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ (SPV) ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా విస్తృతమైన హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు.
* రింగ్ ఆర్కిటెక్చర్‌తో అంతరాయం లేని నెట్…
రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ విధానం ద్వారా టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ, ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించేలా ‘రింగ్ ఆర్కిటెక్చర్’ (Ring Architecture) విధానాన్ని రూపొందించనున్నారు. ఈ సరికొత్త సాంకేతికత వల్ల ఒక మార్గంలో నెట్‌వర్క్‌కు ఏదైనా అంతరాయం (వైర్ కట్ అవ్వడం వంటివి) ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గం (Alternative Route) ద్వారా ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి.
* మొదటి దశలో ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యం…
ఈ ప్రాజెక్టు కింద నెట్వర్క్ దెబ్బతిన్న ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీని తక్షణమే పునరుద్ధరించనున్నారు. భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా ఈ ఫైబర్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, నగరాలతో సమానంగా గ్రామాల్లోనూ ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
