* తీర్పు వెల్లడించిన రంగారెడ్డి జిల్లా ఎనిమిదో అదనపు సెషన్స్ కోర్టు
ఆకేరున్యూస్, రంగారెడ్డి: తండ్రి ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ము ఇవ్వలేదనే అక్కసుతో హత్యచేసిన కొడుకు కూతురుకు న్యాయస్థానం జీవితఖైదు విదించింది. అదనపు పీపీ రంగారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం పాత జిల్లెలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ(58) కు కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు తరుణ్, నాలుగో కుమార్తె అంజలి, ఐదో కుమార్తె ప్రియాంక తండ్రితోపాటే జిల్లెలగూడలోని సొంత ఇంట్లో ఉండేవారు. తరుణ్‌కు ఎముకల సంబంధిత క్యాన్సర్ రావడంతో కుడికాలు తీసేశారు. ఆస్తుల పంపకం విషయంలో తరుణ్, అంజలి, ప్రియాంక తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. విసిగిపోయిన తండ్రి ఇంటినుంచి వెళ్లిపోయి నందనవనంలో ఒంటరిగా ఉంటూ వచ్చారు. 2018 నవంబర్ 4వ తేదీన ఓ ఫంక్షన్ కోసం వచ్చిన ఆయన అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రిటైర్ మెంట్ డబ్బుల విషయమై మరోసారి తండ్రితో గొడవపడి దాడిచేశారు. దాడిలో తండ్రి (కృష్ణ) మరణించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దార్యాప్తు అనంతరం రంగారెడ్డి జిల్లా ఎనిమిదో అదనపు సెషన్స్ కోర్టు ముగ్గురికి జీవితఖైదు విదించింది.