Mahabubabad Muthyalamma Bonalu Rakhi Celebrations in wonder kids school
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ముందస్తు పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పత్తిపాక రోడ్డులో ఉన్న వండర్ కిడ్స్ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి, తెలుగు భాషా దినోత్సవ వేడుకలతో పాటు ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
* భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు
పాఠశాల ప్రాంగణంలో ముత్యాలమ్మ తల్లిని ప్రతిష్ఠించి డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల నడుమ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ముందస్తు రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి, తీపి పదార్థాలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 29న గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ముందస్తు తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
* సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన
పాఠశాల ప్రిన్సిపాల్ అనిత మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే విద్యార్థులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. బోనాలు, రాఖీ పౌర్ణమి విశిష్టతతో పాటు గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
