Sammakka Sarakka Inspiration
* కుల వివక్షను నిర్మూలించాలి
ఆకేరు న్యూస్, ములుగు: దోపిడీ, పీడన, దౌర్జన్యం, అణచివేత, అహంకారానికి వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి వీరమరణం పొందిన వన దేవతలు సమ్మక్క, సారక్కలే ప్రజా పోరాటాలకు స్ఫూర్తి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు.
మేడారంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ సమ్మక్క–సారక్క వన దేవతల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భవిష్యత్తులో ఎమ్మార్పీఎస్ చేపట్టబోయే ప్రజా ఉద్యమాలకు సమ్మక్క, సారక్కల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కుల వివక్ష తీవ్ర స్థాయిలో పెరిగిందని అన్నారు. ఆధునిక భారతదేశంలో కుల వివక్ష అతిపెద్ద సామాజిక రుగ్మతగా మారిందని పేర్కొన్నారు. మాజీ చీఫ్ జస్టిస్ గవాయిపై బూట్లు విసిరి దాడి చేయడం, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన స్థలాన్ని శుద్ధి చేయడం, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు కుల వివక్షకు నిదర్శనమని అన్నారు.
దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందని, కుల నిర్మూలన కోసం ఉద్యమం చేపడతామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. కుల వ్యవస్థ వల్ల నష్టపోయిన బ్రాహ్మణేతర కులాలను ఏకం చేసి పోరాటం చేస్తామని అన్నారు.
అలాగే పేదరిక నిర్మూలన, మత సామరస్యం, లింగ సమానత్వం కోసం భవిష్యత్తులో ఉద్యమాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ పోరాటాలకు సమ్మక్క, సారక్క తల్లుల ఆశీస్సులు కోరుకున్నామని తెలిపారు.
అక్టోబర్ 7న అమరావతిలో నూతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ, జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల జిల్లా ఇన్చార్జీలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
