Vardhannapet
* ఎంసీపీఐయు ధర్నా
Vardhannapet| ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వర్ధన్నపేట మండల కార్యాలయం ఎదుట ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంద రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల జీవనభృతి, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు నెలకు రూ.4 వేల పెన్షన్, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులకు రూ.12 వేల ఆర్థిక సాయం వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలు అందించాలని, చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలతో పాలన సాగుతోందని మంద రవి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, అందుకే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వర్ధన్నపేట తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బత్తిని కుమారస్వామి, గుగులోతు అరుణ్ నాయక్, ఉడుత గణేష్, ఉడుత బిక్షపతి, డివిజన్ కమిటీ సభ్యులు కొత్తూరు కరుణాకర్, అమరాతి యాదగిరి, ఎండి కాజా మియా, గజ్జల రాజు, బత్తిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
