Medaram UNESCO Heritage KHT
* కుంభమేళా తర్వాత దేశంలోనే అతిపెద్ద ‘అమూర్త వారసత్వం’ మేడారం
ఆకేరు న్యూస్, హన్మకొండ: ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (KHT) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాండురంగారావు ప్రసంగించారు. రామప్ప దేవాలయం సాధించిన అంతర్జాతీయ గుర్తింపును గుర్తు చేసుకుంటూ, తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన మేడారం జాతరను ప్రపంచ వేదికపై నిలబెట్టడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు.
*10 ఏళ్ల పాటు అలుపెరగని కృషి
రామప్ప దేవాలయానికి యునెస్కో హోదా ఊరికే రాలేదని, దీని వెనుక కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, పురావస్తు శాఖ (ASI), మరియు రాష్ట్ర పురావస్తు శాఖలు దాదాపు 10 ఏళ్ల పాటు అలుపెరగని కృషి చేశాయని పాండురంగారావు గుర్తు చేశారు. “రామప్ప యునెస్కో డోసియర్ను నేను స్వయంగా డైరెక్ట్ చేశాను. నవంబర్ 22, 2019న పాపారావుతో కలిసి పారిస్ వెళ్లి, అక్కడి ప్రతినిధులకు రామప్పలోని జియో ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ విశిష్టతను వివరించాం. ఆ శ్రమ ఫలితంగానే నేడు రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగొందుతోంది” అని ఆయన వివరించారు.
*కుంభమేళా తర్వాత లక్షలాది మంది హాజరయ్యే అతిపెద్ద జాతర
రామప్ప సాధించిన స్ఫూర్తితో ఇప్పుడు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను యునెస్కో ‘అమూర్త సాంస్కృతిక వారసత్వం’ (Intangible Cultural Heritage) జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత లక్షలాది మంది హాజరయ్యే అతిపెద్ద జాతర మేడారమేనని, ఇది మన దేశపు గొప్ప సాంస్కృతిక సంపద అని ఆయన కొనియాడారు.
*మే 2 నుంచి 8 వరకు ప్రత్యేక ప్రణాళిక
మేడారం విశిష్టతను యునెస్కోలో ప్రాజెక్ట్ చేసేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 2 నుండి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పాండురంగారావు వెల్లడించారు. ఈ మహత్తర కార్యంలో భాగస్వాములవుతున్న అతిథులకు, సహకరిస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వారసత్వాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
