* మిస్ వరల్డ్ పోటీల వేళ మరక
* తెలంగాణ గౌరవం మంట గలిపారని విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఓ ఆంగ్ర ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన ఆరోపణలు, ఆమె పోటీల నుంచి తప్పుకోవడం దుమారం రేపుతోంది. హైదరాబాద్లో నిర్వహిస్తున్న అందాల పోటీలు, గతంలోలాగా కాకుండా భిన్నంగా ఉంటాయని అనుకున్నానని.. కానీ కోతుల ప్రదర్శనలా కూర్చోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. పోటీలకు స్పాన్సర్ చేస్తున్న మధ్య వయసు పురుషులతో కలివిడిగా ఉండాలని, ఆకట్టుకోవాలని ఒత్తిడి తేవడం, తనను వేశ్యలా చూస్తున్నట్టు అనిపించిందని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకొన్నానని పేర్కొన్నారు. అల్పా హారం సమయంలో ఒక్కో టేబుల్ వద్ద ఆరుగురు అతిథులతో ఇద్దరు చొప్పున పోటీదారులను కూర్చోబెట్టారని, గంటలకు గంటలు వారిని అలరిస్తూ కూర్చోవాలని చెప్పడం తాను నమ్మలేకపోయానన్నారు. నేను వారిని అలరించడానికి ఇక్కడికి రాలేదు కాబట్టే పోటీల నుంచి వైదొలిగానన్నారు. మిస్ వరల్డ్ అధికారుల్లో ఒకరు నేను చెబుతుంటే విసిగిస్తున్నానని (బోరింగ్) అన్నారు. చాలా అగౌరవంగా అనిపించిందని చెప్పారు. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) తీవ్ర స్థాయిలో స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువును, దేశ ప్రతిష్టను మంటగలిపిందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలను కలిగిస్తున్నదని చెప్పారు. చాలా గ్రాండ్గా ఈ వేడుకలు నిర్వహిస్తామని, పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని, ఈ పోటీలతో పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదని, మన రాష్ట్ర రాజధానిలో పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు, మన దేశ పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయమన్నారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
