Seethakka Praja Darbar Programme
* ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తాం. రాష్ట్ర మంత్రి సీతక్క.
* ప్రజా దర్బార్ కు హాజరైన 10 గ్రామాల ప్రజలు.
* పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
ఆకేరు న్యూస్,ములుగు:
ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో సమస్య తో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడానికి స్థానిక గ్రామాలకే జిల్లా యంత్రాంగం కదిలి వస్తుందని, ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, కన్నాయి గూడెం మండలంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10 గ్రామాల ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో తుపాకులగూడెం, లక్ష్మీపురం, రాజన్నపేట గ్రామాల ప్రజలు ,ముప్పనపల్లి గ్రామంలోని కార్యక్రమంలో ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, ఐలాపురం, చింతగూడెం, సర్వాయి, కంతనపల్లి, ఏటూరు గ్రామాల ప్రజల నుంచి మంత్రి సీతక్క, ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
మొదట కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామంలో 20 లక్షల అంచనా విలువతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం, సి ఆర్ ఆర్ – ప్లెయిన్ నిధులతో 60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీ లను, ముప్పనపల్లి గ్రామంలో బోరే గూడెం నుండి ఎస్టి కాలనీ వరకు ఎస్ టి ఎస్ డి ఎఫ్ 145.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు, సి ఆర్ ఆర్ – ప్లెయిన్ నిధులతో 115.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లు, డ్రెయినేజీ లను మంత్రి,ఐటిడిఏ పిఓ తో కలిసి ప్రారంభించి, నూతన అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆయా గ్రామాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల సమస్యలను వారి చెంతనే పరిష్కరించాలనే లక్ష్యంతో కన్నాయిగూడెం మండలంలో రెండు ప్రధాన కేంద్రాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు జరిగిందన్నారు. ముప్పనపల్లి, దేవాదుల లక్ష్మీపురం గ్రామాల్లో ఏర్పాటు
ప్రజా దర్బార్ లో 10 గ్రామాల సర్పంచ్ లు ఆయా గ్రామాలకు కావలసిన అభివృద్ధి పనులు స్థానిక సమస్యలను వివరించడం జరిగిందని, గ్రామస్తుల నుంచి నేరుగా వారి సమస్యలను తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడం కోసం జిల్లా కేంద్రానికి దూరంగా, వెనుకబడిన ప్రాంతం కన్నాయిగూడెం మండల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా అధికారులే నేరుగా గ్రామాలకు తరలివచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
స్థానిక సర్పంచులు, ప్రజల నుంచి నేరుగా గ్రీవెన్స్ స్వీకరించి, సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించడం జరుగుతుందని, ఇతర సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు ఉన్న సమస్యలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల వలె కలిసి పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి మనన్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి.,సంపత్ రావు, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డిఓ వెంకటేష్, జిల్లా అధికారులు, స్థానిక సర్పంచ్ లు,ప్రజా ప్రతినిధులు, తహసిల్దార్, యంపిడిఓ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
