School Reopening Preparations Minister Seethakka
* పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.
* విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
* ములుగు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్.
ఆకేరు న్యూస్, ములుగు:
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు , విద్యాశాఖ అధికారులు, సంబంధిత సెక్టోరియల్ అధికారులతో మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పాఠశాలల హౌస్ సంసిద్ధతపై సమగ్రంగా సమీక్షించారు.
వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలలకు హాజరుకానున్న క్రమంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు,పాఠశాలల ఆవరణ, తరగతి గదులు, హాస్టల్ గదులు, వంటశాలలు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి లోపాలుంటే వెంటనే సరిచేయాలని ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.పాఠశాలల్లోని తాగునీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో శుభ్రపరచి పరిశుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బాలికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం అందించాలన్నారు.
వేసవి సెలవుల కారణంగా కొంతకాలంగా మూతపడి ఉన్న తరగతి గదులు, హాస్టల్ గదుల్లో విషపురుగులు, పాములు, క్రిమికీటకాలు ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అవసరమైన క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపు, క్రమశిక్షణ, హాజరు శాతాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
“విద్య అనేది వ్యక్తిగత అభివృద్ధికే కాదు, సమాజాభివృద్ధికి మూలాధారం. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను మరింత నిబద్ధతతో నిర్వహించాలని మంత్రి సీతక్క కోరారు.
ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించడంలో అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
