* ప్రజలు, మేడారం భక్తుల కోసం నిరంతరం శ్రమిస్తా.
* తప్పుడు ప్రచారంపై నిప్పులు చేరిగిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ,మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
తను చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పరితపించే ఆదివాసి బిడ్డను తాను అని పేర్కొన్నారు. తాను పారిపోయే రకం కాదని, భక్తులు–ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేశారు. ఆదివాసి అస్తిత్వం, తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భయపడబోనని మంత్రి తెలిపారు.
జాతరను విజయవంతంగా నిర్వహించామని ,జాతర అనంతరం చేపట్టాల్సిన పనులన్నీ సమర్థంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి మేడారం పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేస్తున్నామని, రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. వీఐపీల అధిక రాకపోకల కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన మాట వాస్తవమేనని, ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయని మంత్రి వివరించారు. అయితే గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని,గట్టమ్మ దర్శనం అనంతరం సమ్మక్కకు వచ్చే సంప్రదాయం దృష్టిలో ఉంచుకుని అక్కడ సజావుగా రాకపోకలు కొనసాగించగలిగామని చెప్పారు. ఈసారి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించగలిగామని తెలిపారు. భక్తితో పాటు బాధ్యత, సంయమనం పాటిస్తూ దర్శనాలకు రావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి ఫలించిందని, అందుకే జాతర బ్రహ్మాండంగా సాగిందని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మలతో తమకు భావోద్వేగ బంధం ఉందని, అందుకే ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించామని చెప్పారు. గుడి నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుందని, జాతరకు ముందే శాశ్వత నిర్మాణ పనులు పూర్తి కావడం వల్లే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని తెలిపారు. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి–రెండు లక్షల మంది మాత్రమే వచ్చేవారని, కొత్త గుడి నిర్మాణం అనంతరం ఒక్క రోజులోనే ఎనబై లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చారని చెప్పారు. తాత్కాలిక ఏర్పాట్లకు బదులు శాశ్వత ఏర్పాట్లు చేయడం వల్లే ఈ రద్దీ సాధ్యమైందని వివరించారు. త్రాగునీరు, టాయిలెట్లు ముందస్తుగానే సిద్ధం చేశామని తెలిపారు.
సమ్మక్కను సకాలంలో గద్దెలపైకి తీసుకురావడంలో పూజారులు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బంది పూజారులను గుర్తించలేక పొరపాటు జరిగిందని, అది ఉద్దేశపూర్వకమైంది కాదని స్పష్టం చేశారు.
క్యాబినెట్ ఒకరోజు మేడారంలోనే ఉండి నిర్ణయాలు తీసుకోవడం చరిత్రాత్మకమని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుక్రవారం వీఐపీ తాకిడి ఎక్కువగా ఉండటంతో కొందరు వీఐపీలు 30 నుంచి 40 వాహనాలతో రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ఆ సమయంలో కూడా రాజకీయాలు చేయడానికి కొందరు ప్రయత్నించారని విమర్శించారు.
సాధారణ భక్తులు పూర్తి స్థాయిలో సహకరించడంతో పసర దారిలో ట్రాఫిక్ జామ్ లేకుండా నిర్వహించగలిగామని చెప్పారు. భక్తులు సజావుగా దర్శనాలు చేసుకుని ఆనందంతో తిరిగివెళ్లారని, కొంతమంది భక్తులకు కలిగిన అసౌకర్యానికి ప్రభుత్వం చింతిస్తున్నదని తెలిపారు. ఈ జాతర అనుభవాల ఆధారంగా వచ్చే జాతరలో ట్రాఫిక్ జామ్ పూర్తిగా లేకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తల్లుల జనప్రవేశం నుంచి వనప్రవేశం వరకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించామని, ఆ అప్రమత్తత వల్లే కోట్లాది మంది భక్తులు వచ్చినా సులభంగా దర్శనాలు సాధ్యమయ్యాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేడారం జాతరలో ప్రమాదాలు జరుగుతాయని కొందరు స్వామీజీలు తప్పుడు ప్రచారాలు చేశారని, సమ్మక్క–సారలమ్మలపై ప్రజల్లో పెరుగుతున్న భక్తిని కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర ములుగు ఆర్డీవో వెంకటేష్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ గ కళ్యాణి తదితరులున్నారు.
……………………………………………………….
