Miyapur Crime News
* మియాపూర్ హోటల్లో వైద్య విద్యార్థిని మృతదేహం..
* ప్రియుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నగరంలోని మియాపూర్‌లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హనుమకొండలో పీజీ పీడియాట్రిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న 27 ఏళ్ల కోమటి సృజన.. మియాపూర్‌లోని ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*ఫోన్ స్విచ్ఛాఫ్.. పోలీసులకు ఫిర్యాదు..
సంగారెడ్డి జిల్లాకు చెందిన సృజన హనుమకొండలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ పీడియాట్రిక్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. సెప్టెంబర్ 30న ఆమె హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పాటు ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సృజన మొబైల్ ఫోన్ ఆధారంగా ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ మియాపూర్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు.
*హోటల్ గదిలో మృతదేహం..
పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి సదరు హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ సిబ్బంది సహాయంతో 502వ గదిని తెరిచి పరిశీలించగా.. సృజన మృతదేహం కనిపించింది. అప్పటికే మృతదేహం డీకంపోజ్ అయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
*ప్రియుడు రవికుమార్‌పై అనుమానాలు..
సృజన మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెకు రవికుమార్ అనే యువకుడితో గతంలో ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో గత ఆరు నెలలుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సెప్టెంబర్ 30న సృజన హోటల్‌కు వచ్చిన సమయంలో రవికుమార్ కూడా ఆమెతో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. సృజన మృతి అనంతరం రవికుమార్ హోటల్ నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
*బంగారు గొలుసు వ్యవహారంపైనా విచారణ..
సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో రవికుమార్‌పై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో సృజనకు సంబంధించిన బంగారు గొలుసును రవికుమార్ తీసుకున్నాడని ఆయన పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రవికుమార్‌పై కేసు నమోదు చేసి అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*హత్యా? ఆత్మహత్యా?..
సృజన మృతికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. హత్య జరిగిందా? ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజీలు, సృజన మొబైల్ ఫోన్ కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
