MLA Kadiyam Srihari Station Ghanpur Co Option Members
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఎండి.రహీమున్నిసా, ఎండి. మాషుఖ్, బూర్ల లత, గన్ను నర్సింహులులకు మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కో ఆప్షన్ సభ్యులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపాలిటీ కౌన్సిలర్ల సంఖ్య కో ఆప్షన్ సభ్యులతో కలిపి 18 నుండి 22కు పెరిగిందని అన్నారు. కొత్తగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ లో ఓటు వేసే హక్కు తప్ప కౌన్సిలర్లకు ఉండే అన్ని హక్కులు ఉంటాయని తెలిపారు. కౌన్సిలర్లకు, నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు జూన్ 15 వరకు ఒక్కో వార్డుకు 10లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వెంటనే మీ వార్డులలో అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికల జరగక ముందే 50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని అలాగే 8 కోట్ల జనరల్ ఫండ్ ఉందని తెలిపారు. ఒకప్పుడు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితి నుండి ఇప్పుడు దాదాపు 60 కోట్ల నిధులతో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఉందని వెల్లడించారు. మున్సిపాలిటీ సిబ్బందికి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సిబ్బంది జీతాల విషయంలో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే ఏప్రిల్, మే నెలల పెండింగ్ జీతాలు జూన్ 1వ తేదీన చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తూ రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ పుట్టినరోజు సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
