MLA Kadiyam Srihari Katamayya Safety Kits
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రమాదాల నివారణ, గీత కార్మికుల భద్రత కోసం శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా కాటమయ్య రక్షణ కిట్లు పంపిణి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో బుధవారం ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు సంబదించిన 678 మంది గౌడ సోదరులకు కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గౌడ సోదరులు ప్రమాదాలకు గురికాకుండా వారికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో బిసి సంక్షేమ శాఖ, ఏక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కాటమయ్య రక్షణ కిట్లను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. 10 వేల రూపాయల విలువ చేసే ఈ రక్షణ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.
శిక్షణ పొంది రక్షణ కిట్లు తీసుకున్న గౌడ సోదరులు వాటిని పక్కన పెట్టకుండా తప్పకుండా ఉపయోగించాలని సూచించారు. గ్రామాలలో కుల సంఘాల ఆధ్వర్యంలో రక్షణ కిట్లను ఉపయోగించే విధంగా చూడాలని అలాగే ఏక్సైజ్ శాఖ పంపిణి చేసిన రక్షణ కిట్లు ఉపయోగిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధ పడడం కంటే ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మొత్తం 1679 కాటమయ్య రక్షణ కిట్లు మంజూరు అయ్యాయని ఈ రోజు పంపిణి చేసుకుంటున్న 678తో కలుపుకొని ఇప్పటి వరకు 1558 రక్షణ కిట్లను పంపిణి చేసుకున్నామని తెలిపారు. ప్రమాదానికి గురైన కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి, ఏక్సైజ్ శాఖ సూపరిండెంట్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, గౌడ కులస్తులు, కల్లు గీతా కార్మికులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
