kadiyam srihari raithu mela warangal
ఆకేరు న్యూస్, హనుమకొండ : రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడిలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి మరియు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు నిదర్శనమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏర్పాటు చేసిన మూడు రోజుల రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా గురువారంతో ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
* ట్రాక్టర్ నడిపి సందడి చేసిన ఎమ్మెల్యే
వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను కడియం శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి అక్కడి రైతులను ఉత్సాహ పరిచారు. ఆధునిక వ్యవసాయ పరికరాల పనితీరును, డ్రోన్ టెక్నాలజీని పరిశీలించిన ఆయన, రైతులకు ఇవి ఏ మేరకు లాభదాయకంగా ఉంటాయో అధికారులతో చర్చించారు. అనంతరం వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
* కాళేశ్వరం వైఫల్యాలపై ఘాటు విమర్శలు
సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. “అన్నీ నేనే అయి కాళేశ్వరం కట్టానని గతంలో కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారు. కానీ 2023లోనే మెడిగడ్డ బ్యారేజ్ నాణ్యత లోపం కారణంగా మూడు పిల్లర్లు కుంగిపోయాయి. ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మెడిగడ్డను గడిచిన మూడేళ్లుగా వాడటం లేదు, ఒక్క చుక్క నీరు కూడా అక్కడి నుండి లిఫ్ట్ చేయలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్ హయాంలో సాగు విస్తీర్ణం ఏకంగా 80 శాతం పెరగడం గమనార్హం” అని ఆయన పేర్కొన్నారు.
* రికార్డు స్థాయి దిగుబడి – రైతులకు భరోసా
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 2 కోట్ల 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని కడియం వెల్లడించారు. రూ. 21 వేల కోట్లతో ఏకకాలంలో 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు భరోసా కింద రూ. 27 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, నేడు కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని ఆయన స్పష్టం చేశారు.
* మంత్రులకు కీలక విజ్ఞప్తులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రవాణాలో జాప్యం లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కడియం కోరారు. అలాగే, యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే మండల కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
* రైతులకు సూచనలు
పంట మార్పిడి వైపు అడుగులు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను రైతులు గమనించాలని కడియం శ్రీహరి సూచించారు. ఒకే రకమైన పంటలు కాకుండా, భూసారాన్ని రక్షించే పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆర్థికంగా లాభపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్లు చాహాత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
