MLA PADI KAUSHIK REDDY HUZURABAD RTC STRIKE
ఆకేరు న్యూస్ , హుజురాబాద్:
ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండి కలిసి పోరాడుదామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, ఇది ప్రభుత్వ హత్యేనని కౌశిక్ రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం గెజెట్ చేసిందనీ, ఆ గెజెట్ ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి కోసం ఏటా రూ. 1500 కోట్లు ఇచ్చి ఆదుకుందని, కానీ ఇప్పుడు నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో సంస్థ కష్టాల్లో పడిందని ఆయన ఆరోపించారు. కార్మికులు జీతాలు అందక, ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ఆయన కోరారు.
