Bhimeadevarapalli Tahsildar Office
* భీమదేవరపల్లి రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మార్పీఎస్ నేత వెంకటస్వామి ఫైర్
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి:
భీమదేవరపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల వేళాపాల లేని వైఖరి, తీవ్ర నిర్లక్ష్యం వల్ల భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే రైతులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్ల వెంకటస్వామి మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
* సమయపాలన మరచిన అధికారులు
మండల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ (డిటి), సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు మరియు ఇతర సిబ్బంది కనీస సమయపాలన పాటించడం లేదని ఆయన విమర్శించారు. నిబంధనల ప్రకారం ఉదయం 10:00 గంటలకల్లా కార్యాలయానికి చేరుకోవాల్సి ఉండగా, ఉదయం 11:30 గంటలు దాటినా అధికారులు ఆఫీసుకు రావడం లేదని ఆరోపించారు. దీనివల్ల వివిధ గ్రామాల నుండి, దూర ప్రాంతాల నుండి ఎన్నో ఆశలతో వచ్చే పేద రైతులు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
* రైతు కష్టం.. అధికారుల నిర్లక్ష్యం విరాసత్ పేరుతో ₹20 వేలు స్వాహ
వంగర గ్రామానికి చెందిన ఒక దళిత రైతు ప్రస్తావిస్తూ అధికారుల పనితీరును మాట్ల వెంకటస్వామి ఎండగట్టారు. సదరు దళిత రైతు తండ్రి మరణించడంతో ఆయనకు వారసత్వంగా రావలసిన భూమికి సంబంధించిన విరాసత్ (వారసత్వ) ఫైలును గత రెండేళ్లుగా అధికారులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఈ ఫైలును ఆర్డీఓ (RDO) ఆఫీస్‌కు పంపగా సాంకేతిక కారణాలతో రెండుసార్లు తిరస్కరణకు గురైందని, మూడోసారి సరిచేసి పంపాల్సిన స్థానిక అధికారులు కనీసం పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో ఇప్పటికే మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల సదరు పేద రైతు దాదాపు ₹20,000 వరకు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
* లంచాలు డిమాండ్ చేస్తున్న సిబ్బంది.. పట్టించుకోని తహశీల్దార్
రెవెన్యూ కార్యాలయంలోని క్రింది స్థాయి సిబ్బంది బహిరంగంగానే లంచాలు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు చెల్లించే సత్తా లేక “మా ఫైలును ముందుకు పంపించండి” అని తహశీల్దార్‌ను సదరు బాధితుడు పలుమార్లు బతిమిలాడినా ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.
* రైతు సమస్యలు తీర్చకుంటే తహశీల్దార్ ఆఫీస్ ముట్టడే..
ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భీమదేవరపల్లి తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది నిర్దిష్ట సమయపాలన పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని మాట్ల వెంకటస్వామి మాదిగ డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత, పేద రైతులకు సంబంధించిన భూ సమస్యలను, ఏళ్లకు ఏళ్లుగా నిలిచిపోయిన విరాసత్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
