Mule Bank Accounts
* అద్దెకు బ్యాంకు ఖాతాల వెనుక.. అసలేం జరుగుతోంది?
* మ్యూల్ ఖాతాలతో సైబర్ దొంగల మాయాజాలం
* పోలీసులకు పట్టుబడుతోంది ఖాతాదారులే!
ఆకేరు న్యూస్, బిగ్ స్టోరీ : సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును బదిలీ చేయడానికి వినియోగిస్తున్న మార్గాలు మూల్ ఖాతాలు. నేరుగా తమ ఖాతాల్లో డబ్బు వేసుకుంటే ఇట్టే దొరికేస్తామని బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకోవడం లేదా ఇతర మార్గాల్లో సృష్టించో వాడుతుంటారు. ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌ల లావాదేవీలకు కూడా ఉపయోగిస్తున్నవి అవే. ఈ తరహా కేసుల్లో పోలీసులకు పట్టుబడుతున్నది ఖాతాదారులే.. అసలైన సూత్రధారులు దొరకడం లేదు.
తెలియక కొంత మంది.. 5శాతం కమీషన్ కు ఆశపడి.. ఇంకొంత మంది తమ ఖాతాలను నేరగాళ్ల చేతుల్లో పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు మ్యూల్ ఖాతాలు అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు వీటిని ఎలా దుర్వినియోగం చేస్తారో, ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకుంటే ఎలాంటి తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.
మ్యూల్ ఖాతాలు అంటే ఏమిటి?
ఇటీవల హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ పోలీసులు బ్యాంకు ఖాతాలను అద్దెకిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వివిధ వ్యక్తుల నుంచి బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు సేకరించి, వాటి కిట్లు, కేవైసీ పత్రాలు తీసుకుని సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల ద్వారా లావాదేవీల ద్వారా వాళ్లు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
23 మ్యూల్ ఖాతాలు వెలుగులోకి వచ్చాయి. “మ్యూల్” అంటే ఆంగ్లంలో బరువులు మోసే జంతువు లేదా కంచర గాడిద అని అర్థం. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే.. ఒకరి నేరపూరిత లేదా అక్రమ డబ్బును మరొకరి ద్వారా చేతులు మార్చడానికి ఉపయోగించే బ్యాంక్ ఖాతాలనే “మ్యూల్ ఖాతాలు” అంటారు.
ఉదాహరణకు చెప్పాలంటే..
ఒక సైబర్ నేరగాడు ఎవరినైనా మోసం చేసి రూ. 5 లక్షలు కొల్లగొట్టాడనుకుందాం. ಆ డబ్బును నేరుగా తన సొంత బ్యాంక్ ఖాతాలో వేసుకుంటే పోలీసులు వెంటనే అతడిని పట్టుకుంటారు. అందుకే నేరగాడు తన సొంత ఖాతాకు బదులుగా, అమాయకులైన వేరే వ్యక్తుల బ్యాంక్ ఖాతాలను (మ్యూల్ ఖాతాలు) వాడుకుంటాడు. ఆ డబ్బును అందులోకి మళ్లించి అక్కడి నుంచి విత్‌డ్రా చేయడం లేదా వేరే డిజిటల్ వ్యాలెట్లకు చేరవేయడం చేస్తాడు.
ఈ ఖాతాలను ఎలా సృష్టిస్తారంటే?
కేపీహెచ్‌బీ ఘటనలో చూసినట్లుగా, నేరగాళ్లు మ్యూల్ ఖాతాలను సేకరించడానికి ప్రధానంగా మూడు పద్ధతులను ఉపయోగిస్తారు. అందులో మొదటిది కమీషన్లు ఆశ చూపడం. “మీ బ్యాంక్ ఖాతా ఉంటే చాలు, నెలకు లేదా ప్రతి లావాదేవీపై 5% నుండి 10% కమీషన్ ఇస్తాం” అని నిరుద్యోగులను, విద్యార్థులను లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని బురిడీ కొట్టిస్తారు.
రెండోది “డేటా ఎంట్రీ ప్రాజెక్ట్” లేదా “ఆన్లైన్ ఫైనాన్స్ ఏజెంట్” పేరిట ప్రచారాలు చేసి, క్లయింట్ల డబ్బు ప్రాసెస్ చేయడం కోసం మీ ఖాతాను వాడుకుంటామని నమ్మిస్తారు. అలాగే ఉచితంగా కేవైసీ లేదా లోన్ ఇప్పిస్తామని నమ్మించి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ కేవైసీ సర్వీసుల పేరిట తీసుకుంటారు.
వారి ప్రమేయం లేకుండానే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లేదా ఇతర డిజిటల్ బ్యాంకింగ్ యాప్‌లలో కొత్త ఖాతాలు తెరిచేస్తారు. సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లలో కొత్త సిమ్‌లు వేసి, ఈ యాప్‌లను నేరగాళ్లే వినియోగిస్తారు.
కమీషన్ల కోసం ఆశపడితే జైలుకే..
మీ బ్యాంక్ ఖాతాను వేరొకరికి కమీషన్ ప్రాతిపదికన ఇస్తే, చట్టం దృష్టిలో మీరు సైబర్ నేరస్థుడితో సమానమే. “నేను ఖాతా మాత్రమే ఇచ్చాను, అందులో ఏం డబ్బులు వచ్చాయో నాకు తెలియదు” అంటే చట్టం ఒప్పుకోదు. మీ పేరిట ఉన్న ఖాతాలో ఏ అక్రమ లావాదేవీ జరిగినా దానికి చట్టపరమైన పూర్తి బాధ్యత మీదే అవుతుంది. 5% కమీషన్ కోసం ఆశపడితే అంతిమంగా జైలుపాలు కావాల్సి వస్తుంది. పాన్ కార్డ్ ..ఆధార్ కార్డులు ‘సైబర్ క్రైమ్ నేషనల్ డేటాబేస్’లో బ్లాక్‌లిస్ట్ అవుతాయి. భవిష్యత్తులో దేశంలో ఏ బ్యాంకులోనూ మీరు ఖాతా తెరవడానికి, లోన్ తీసుకోవడానికి లేదా క్రెడిట్ కార్డు పొందడానికి అర్హత కోల్పోతారు.
మీ పేరిట మ్యూల్ ఖాతాలు ఉన్నాయా?
మీ ప్రమేయం లేకుండా లేదా మీ ప్రమేయంతోనే మీ వివరాలు దుర్వినియోగానికి గురయ్యాయని అనుమానం ఉంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన TAFCOP (tafcop.sancharsaathi.gov.in) వెబ్సైట్లోకి వెళ్లండి.
మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. అక్కడ మీ పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కనిపిస్తుంది. మీకు తెలియని లేదా మీరు వాడని నంబర్లు ఉంటే వెంటనే అక్కడికక్కడే “Not My Number” అని రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.
అలాగే ఉచిత CIBIL లేదా Experian రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పేరిట మీకు తెలియకుండా ఏవైనా కొత్తగా డిజిటల్ బ్యాంక్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు లేదా లోన్ యాప్‌ల ఖాతాలు ఓపెన్ అయ్యాయో లేదో అక్కడ వివరంగా తెలుస్తుంది. మీ నంబర్‌పై ఏదైనా పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ ఓపెన్ అయిందో లేదో ఆయా అధికారిక యాప్‌ల ద్వారా లేదా కస్టమర్ కేర్ ద్వారా కూడా నిర్ధారించుకోవచ్చు.
నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బ్యాంకు ఖాతాలను అద్దెకివ్వడం చాలా పెద్ద నేరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ప్రమేయం లేకుండా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానం ఉంటే వెంటనే 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
సంబంధిత బ్యాంకులకు కూడా వెళ్లి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల్లో గెల్డెన్ అవర్ అతిముఖ్యమైనదని, నేరం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చునని పేర్కొంటున్నారు.
మరిన్ని జాగ్రత్తలు
* మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌బుక్, చెక్‌బుక్, ఏటీఎమ్ కార్డ్, లేదా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు కమీషన్ కోసం ఇవ్వకండి.
* మీ ఓటీపీ లేదా ఆధార్ ఇ-కేవైసీ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు.
* ఒకవేళ పొరపాటున మీ ఖాతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లు తెలిస్తే, తక్షణమే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేసి, సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ ఖాతాను బ్లాక్ చేయించండి.
వెలుగులోకి వచ్చిన కీలక ఘటనలు
* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు వారాల పాటు ప్రత్యేక సోదాలు నిర్వహించి 101 మంది మ్యూల్ ఖాతాదారులు, మధ్యవర్తులను అరెస్ట్ చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ. 17 కోట్ల అక్రమ ఫ్రాడ్ లావాదేవీలను అధికారులు గుర్తించారు.
* దేశవ్యాప్తంగా నమోదైన 1,172 సైబర్ నేరాల వెనుక ఈ 101 మంది ఖాతాలు ఉన్నట్లు తేలింది.
* హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి నకిలీ ‘స్టార్ అగ్రో ఇండస్ట్రీస్’ పేరిట నకిలీ అద్దె ఒప్పందాలు సృష్టించి ఏకంగా 30కి పైగా మ్యూల్ కరెంట్ ఖాతాలు తెరిపించిన ఉదంతాన్ని సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది.
* ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు బ్యాంకు ఖాతాలను సమకూరుస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వాటిలో 23 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు గుర్తించారు. పల్లపోలు వామనరెడ్డి (41), వాసగాని శ్రీనివాస్ అలియాస్ ప్రభాస్ (34)లను అరెస్టు చేశారు. ‘జింట్రా’ యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నట్లు కనుగొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

