Mulugu SP Sudheer Ram Nath Kekaan
* అక్రమ పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు : ములుగు ఎస్పీ
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లాలో ఇసుక లారీల తో జరుగుతున్న అతివేగ ప్రయాణం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారులపై అక్రమ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల ప్రాణ భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాహనాలు నడిపినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా లారీలను నిలిపినా సంబంధిత వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ తెలిపారు.
ఇసుక లారీ డ్రైవర్లు నిర్దేశిత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనాలు నడపరాదని సూచించారు. ప్రధానంగా జనావాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, విద్యాసంస్థలు, రద్దీగా ఉండే కూడళ్ల వద్ద అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఆదేశించారు. వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లారీల యజమానులు తమ డ్రైవర్లకు రహదారి భద్రతా నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చెల చొరవ తీసుకోవాలని సూచించారు.
ఈనిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా వాహన డ్రైవర్లతో పాటు యజమానులను బాధ్యులను చేస్తామని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని,వాహనాలను చట్ట ప్రకారం సీజ్ చేస్తామని హెచ్చరించారు. ములుగు జిల్లాలోకి వచ్చి వెళ్లే ప్రతి లారీని తనిఖీ చేయడం జరుగుతుందని డ్రైవర్లు తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు.
నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ములుగు జిల్లాలోనీ సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై వర్తించే చట్టాల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రహదారి భద్రతను పరిరక్షించడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, ప్రమాదాలను నివారించడమే ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని, ప్రజల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి ఉల్లంఘనలనూ సహించేది లేదని, ఇసుక లారీ యజమానులు, డ్రైవర్లు పోలీస్ శాఖకు సహకరిస్తూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు రోడ్డు భద్రతలో పాలుపంచుకోవాలని ఎస్పీ కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

