Narsampet Police Save Youth
* ఉరివేసుకున్న యువకుడికి పునర్జన్మ
ఆకేరు న్యూస్, వరంగల్: కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు సకాలంలో స్పందించి అతడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలోని మల్లంపల్లి రోడ్డులో చోటుచేసుకుంది.
స్థానికులు మరియు పోలీసుల వివరాల ప్రకారం.. మల్లంపల్లి రోడ్డుకు చెందిన మురళి అనే యువకుడు కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో తీవ్ర నిర్ణయం తీసుకుని, ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు.
గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉరి వేసుకున్న మురళిని కిందకు దించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని కాపాడారు. అనంతరం తక్షణ వైద్య సహాయం కోసం పోలీసులు తమ వాహనంలోనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వేగవంతమైన స్పందన మరియు సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలు దక్కడంతో స్థానికులు వారిని అభినందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
