* చనిపోవడానికి ముందు పోలీసులకు వీడియో పంపిన యువతి
* నిజామాబాద్‌లో విషాదం
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : ఆమె చేసిన తప్పును భర్త, అత్తమామ అర్థం చేసుకున్నారు. పెద్దమనసుతో క్షమించారు. ఏడాదిగా ఆ దంపతులు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. విషయం తెలిసిన బంధువులు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు. సూటిపోటి మాటలు అంటున్నారు. ఇది తట్టుకోలేక దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా పొతంగల్‌లో విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తమ సూసైడ్‌కు గల కారణాన్ని వివరిస్తూ వీడియో తీసి పోలీసులకు పంపించారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది.
జిల్లాలోని పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్, శైలజ దంపతులకు ఏడాది క్రితం వివాహమైంది. కుటుంబంతో కలిసి సొంతూరిలోనే ఉంటున్నారు. అయితే సోమవారం ఉదయం ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త, అత్తామామలు క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండటాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ ఓ వీడియో తీసి కోటగిరి ఎస్ఐ సందీప్‌కు పంపారు. మా పిన్ని వల్లే తాము చనిపోతున్నామని శైలజ ఆ వీడియోలో పేర్కొన్నారు. గతంలో నేను ఓ తప్పు చేశానని, దానిని క్షమించిన నా భర్త, అత్తామామలు, ఏనాడూ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. కానీ మా పిన్ని ఈ విషయాన్ని మా బంధువుల్లో చాలా మందికి చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని మేం కోరినప్పటికీ బంధువులతోపాటు ఇతరులకూ చెబుతున్నది. ఆమె చెప్పిన మాటలు విన్న బంధువులు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతుండటంతో ఇటీవలే నా భర్త పురుగుల మందు తాగాడు. అయినా ఈ దుష్ప్రచారం ఆగడం లేదు. అందుకే మేం చనిపోతున్నాం. నా చావుకు కారణం మా పిన్ని అంటూ అందులో తెలిపింది. వీడియో అందిన వెంటనే పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాధితుల ఫోన్ నంబరును ట్రాక్‌చేశారు. దీంతో వారిద్దరు ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు రైల్వే పట్టాలపై కనిపించాయి.
————————————————————————–