NH-563 Four Lane
* NH-563 ఫోర్‌లేన్ రెడీ.. 45 నిమిషాలు ఆదా!
* కరీంనగర్–వరంగల్‌కి కొత్త రహదారి
ఆకేరు న్యూస్, హనుమకొండ: కరీంనగర్, వరంగల్ నగరాల మధ్య జాతీయ రహదారి 563 (NH-563) నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సుమారు 1,641 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ 68.015 కిలోమీటర్ల సుదీర్ఘ రహదారి అందుబాటులోకి రావడంతో ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాలు ఆదా కానుంది. ఈ నయా ‘గ్రోత్ కారిడార్’పై శనివారం సన్నాహక పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
* భారీ నిర్మాణాలు
గతంలో కేవలం రెండు వరుసల రోడ్డు మాత్రమే ఉండటంతో వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ మానకొండూర్ బైపాస్ వద్ద ప్రారంభమై హనుమకొండ సమీపంలోని పలవేల్పుల వద్ద ముగిసేలా ఈ విస్తరణ చేపట్టారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా 560 మీటర్ల అత్యంత పొడవైన మానకొండూర్ బైపాస్ వంతెనతో పాటు మొత్తం 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, 5 బైపాస్ రోడ్లు, 25 అండర్‌పాస్‌లు, ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB), ఒక రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణాలు పూర్తి చేశారు.
* అత్యధునిక ప్రమాణాలు
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ రహదారిపై ‘అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (ATMS) సాంకేతికతను అమలు చేస్తున్నారు. రహదారి భద్రత కోసం ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అధునాతన 360 డిగ్రీల కెమెరాను అమర్చి కేంద్ర నిఘా కేంద్రం ద్వారా ట్రాఫిక్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ట్రాఫిక్ స్తంభించినా వేరియబుల్ మెసేజ్ సైన్స్ (VMS) డిజిటల్ బోర్డుల ద్వారా వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందిస్తారు. అంతేకాకుండా 1033 ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు నిరంతరం తిరిగే రూట్ పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సులు, క్రేన్లను అత్యవసర సహాయం కోసం సిద్ధంగా ఉంచారు.
* పర్యావరణ సంరక్షణ
అభివృద్ధికి తోడు పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు రహదారి వెంట 25 కీలక ప్రాంతాల్లో వర్షపు నీటిని ఇంకించే నిర్మాణాలు చేపట్టారు. రహదారికి ఇరువైపులా మరియు డివైడర్ల మధ్యలో కానుగతో పాటు స్థానిక జాతులకు చెందిన పూల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఈ మొక్కలను నిరంతరం సంరక్షించేందుకు ఎక్కడికక్కడే నీటి ట్యాంకర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.
* పరిశ్రమల వికాసం
ఈ నాలుగు వరుసల రహదారి ఆర్థికంగా కూడా ప్రాంతీయ వికాసానికి ఎంతో తోడ్పడనుంది. కరీంనగర్‌లోని గ్రానైట్ పరిశ్రమకు, వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అనుసంధానిస్తూ ఇది సరకు రవాణాను అత్యంత సులభతరం చేస్తుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, శంకరపట్నం, హుజూరాబాద్, మరియు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, హసన్‌పర్తి వంటి కీలక మండల కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాల మీదుగా ఈ రహదారి సాగుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వనుంది.


* క్షేత్రస్థాయి సమస్యలు
రహదారి నిర్మాణం వేగంగా పూర్తయినప్పటికీ, కొన్ని గ్రామాల ప్రజలకు ఇది తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. శంకరపట్నం మండలం పరిధిలోని గొల్లపల్లి, కొత్తగట్టు గ్రామాల వద్ద అవసరమైన గ్రీన్ కారిడార్ లేదా అండర్‌పాస్ నిర్మాణాలను చేపట్టలేదు. రోడ్డుకు సమాంతరంగా సర్వీస్ రోడ్లు నిర్మించినప్పటికీ, రోడ్డు దాటేందుకు సరైన అవకాశం లేకపోవడంతో స్థానికులు ఇవతలి నుంచి అవతలికి వెళ్లాలంటే దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి, టోల్గేట్ దాటి, హుజూరాబాద్ అండర్‌పాస్ నుంచి మళ్లీ వెనక్కి రావాల్సిన దుస్థితి నెలకొంది.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
