GPS Free Drone Technology, BITS Pilani
* బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థుల సృష్టి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: జీపీఎస్ అందుబాటులో లేని, శత్రువుల జామింగ్ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లోనూ డ్రోన్లు సజావుగా పనిచేసే సరికొత్త సాంకేతికతను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అభివృద్ధి చేశారు. ఈ విద్యార్థులు స్థాపించిన ‘బీజన్ టెక్’ స్టార్టప్ భారత సాయుధ దళాల కోసం వినూత్న స్వయంప్రతిపత్తి యుద్ధరంగ వ్యవస్థలను రూపొందిస్తోంది. బిట్స్ హైదరాబాద్‌లోని కోరాస్ ల్యాబ్ వేదికగా పనిచేస్తున్న ఈ సంస్థ, డ్రోన్లు మరియు ఫిరంగులను కృత్రిమ మేధ , రోబోటిక్స్, కంప్యూటర్ విజన్ సాంకేతికతలతో మరింత ఆధునీకరిస్తోంది.
* ప్రయోగాల నిర్వహణ
జీపీఎస్ సిగ్నల్స్ అందని లేదా జామ్ అయిన క్లిష్టమైన ప్రాంతాలలోనూ డ్రోన్లు తమ లక్ష్యాలను ఛేదించేలా ప్రత్యేకంగా ‘బీజన్ అటానమస్ నావిగేషన్ మాడ్యూల్’ను తయారుచేశారు. ఈ అత్యాధునిక వ్యవస్థ పనితీరుపై ప్రస్తుతం పోఖ్రాన్, సికింద్రాబాద్, లేహ్ తదితర వ్యూహాత్మక ప్రాంతాలలో విజయవంతంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ నావిగేషన్ మాడ్యూల్ సాంకేతికత పట్ల సైన్యంలోని ఎనిమిది వివిధ విభాగాల నుంచి విశేష స్పందన లభించి, ఆసక్తి లేఖలు అందాయి.
* యువశాస్త్రవేత్తల అద్భుతాలు
డ్రోన్లతో పాటు ఫిరంగుల ఆటోమేషన్ రంగంలోనూ ఈ యువ పారిశ్రామికవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఫిరంగులను అత్యంత వేగంగా తదుపరి లక్ష్యానికి తరలించేందుకు వీలుగా ‘అటానమస్ ఆర్టిలరీ పొజిషనింగ్ సిస్టమ్’ను రూపొందించారు. దీనికి సంబంధించి ఒక యూనిట్ అమలు నిమిత్తం సైన్యం నుంచి రూ.20 లక్షల ఆర్డర్ కూడా లభించింది. అలాగే భారత సైన్యంలోని సదరన్ కమాండ్ పరిధిలో ‘ప్రచండ్ స్వార్మ్ గ్రౌండ్ స్టేషన్’ సాఫ్ట్వేర్ ఇప్పటికే విజయవంతంగా వినియోగంలో ఉంది.
* రూ.25 లక్షల గ్రాంట్
ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్‌లో తక్కువ ఖర్చుతో దృశ్య ఆధారిత నావిగేషన్ వ్యవస్థను రూపొందించి ఫైనల్స్‌కు చేరిన ఈ విద్యార్థుల బృందం, పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ డిజైన్ బ్యూరో కోసం డ్రోన్ స్వార్మ్ గ్రౌండ్ స్టేషన్‌ను అభివృద్ధి చేసి ప్రదర్శించింది. ‘క్యూరియాసిటీ-2025’లో విజేతగా నిలిచిన ఈ స్టార్టప్‌నకు పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధి కోసం రూ.25 లక్షల గ్రాంట్ కూడా దక్కింది. రక్షణ రంగంలో దేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేయిస్తూ విద్యార్థులు సాధిస్తున్న ఈ విజయాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
