Boinapally Vinod Kumar
Boinapally Vinod Kumar| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు భంగం కలగకుండా పారదర్శక విధానాలు, సమర్థవంతమైన అప్పీల్ వ్యవస్థ ఉండాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఎన్నికల సంఘంపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండేలా కేంద్ర ప్రభుత్వం, ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలపై వచ్చిన వార్తల నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నిర్ణయ ప్రక్రియలో నమోదైన అభ్యంతరాలు, వాటిపై జరిగిన చర్చలు, తుది నిర్ణయాలను ప్రజలకు వెల్లడిస్తే ఈసీపై నమ్మకం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
మరణించిన వారి పేర్ల తొలగింపు, డూప్లికేట్ ఓటర్ల సవరణ అవసరమే అయినప్పటికీ.. ఈ ప్రక్రియలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా అన్యాయంగా ఓటు హక్కు కోల్పోకూడదని అన్నారు. పేరు తొలగింపు, అభ్యంతరాలు, పునఃచేర్పు, అప్పీల్ వంటి అంశాలకు స్పష్టమైన నిబంధనలు, గడువులు ఉండాలని డిమాండ్ చేశారు.
సీఈసీ ఎంపికపై పునరాలోచన
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టాన్ని పునరాలోచించాలని వినోద్‌కుమార్ కోరారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తిరిగి చేర్చేలా చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రతిపక్షం, న్యాయవ్యవస్థ మధ్య సంస్థాగత సమతుల్యత ఉండాలని అన్నారు. ఎన్నికల సంఘం ఏ ప్రభుత్వానికో, అధికార పార్టీకో పరిమితం కాదని, రాజ్యాంగానికి, దేశ పౌరులకు జవాబుదారీగా ఉండాలని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఓటు హక్కును రక్షించే ఎన్నికల సంఘంపై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉండేలా చూడటం అందరి బాధ్యత అని అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
