* అధికారం చేపట్టగానే దీనిపైనే తీర్మానిస్తాం
* కాబోయే సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటన
ఆకేరు న్యూస్ డెస్క్ : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలుపు
అనంతరం సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపడతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూ`కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధానికి సమర్పిస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్‌ను దిల్లీతో పోల్చడంపై ఆయన మండిపడ్డారు. కశ్మీర్‌ను దిల్లీతో పోల్చవద్దని..ఎందుకంటే దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు. కానీ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని, హోంమంత్రి, భాజపా సీనియర్ మంత్రులు చెప్పారని పేర్కొన్నారు. 2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కశ్మీర్లో శాంతిని నెలకొల్పడం, అభివృద్ధికి బాటలు వేయడం కోసం రాష్ట్ర హోదా తప్పనిసరి అని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉన్న రాజకీయ పార్టీలను భాజపా లక్ష్యంగా చేసుకొని.. బలహీనపరచడానికి ప్రయత్నించిందని దుయ్యబట్టారు. కానీ ఆ పార్టీ ఎత్తులు ఫలించలేదన్నారు. ముఖ్యమంత్రిగా తన పేరును తన తండ్రి ప్రకటించడంపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్ష సమావేశం అనంతరం మిత్రపక్షాలతో చర్చలు జరిపి ఈవిషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో 2019లో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోల్పోయింది. దీంతోపాటు ఆ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలన్నది ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. ఒమర్ అబ్దుల్లా కూడా గత అయిదేళ్లుగా అందుకోసమే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంతవరకూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో అడుగుపెట్టబోనని అన్న ఒమర్.. యూటర్న్ తీసుకొని, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు తన ప్రయత్నాన్ని విరమించుకోనని పట్టుదలతో ఉన్నారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
