Telangana Badi Bata Program
* ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వేసవి సెలవులు ముగిసి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం–2013, పీఎం పోషణ (మధ్యాహ్న భోజన) నిబంధనలు–2015 లో భాగంగా విద్యార్థులకు అత్యంత పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ శాఖ అధికారులకు కమిషన్ ప్రత్యేక లేఖలు రాసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
* విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు..
వంటశాలల ఆధునీకరణ: పాఠశాల వంటశాలలను పూర్తిగా శుభ్రపరిచి, అవసరమైన చోట సున్నం వేయించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.
తాగునీటి భద్రత: విద్యార్థులు తాగే నీటి ట్యాంకులు, ఫౌంటెన్లను పూర్తిగా ఖాళీ చేసి, బ్లీచింగ్ పౌడర్‌తో లీకేజీలు లేకుండా శుభ్రపరిచిన తర్వాతే నీటిని నింపాలి.
పాత్రల శుభ్రత: వంటకు ఉపయోగించే పాత్రలను వేడి నీటితో కడిగి, ఎండలో బాగా ఆరబెట్టాలి.
సరుకుల నాణ్యత పరిశీలన: స్టోర్ రూమ్‌లలో నిల్వ ఉన్న పాత బియ్యం, పప్పులు, ఉప్పు, కారం నాణ్యతను తనిఖీ చేయాలి. గడువు ముగిసినా, పాడైపోయినా వాటిని తక్షణమే తొలగించి సరికొత్త సరుకులను మాత్రమే వాడాలి.
మరుగుదొడ్ల నిర్వహణ: విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లను నిరంతరం శుభ్రపరుస్తూ, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలి.
* సిద్దిపేటలో ఘనంగా ‘బడిబాట’..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం క్షేత్రస్థాయిలో జోరుగా సాగుతోంది. సిద్దిపేట హనుమాన్ నగర్‌లోని వడ్డెర కాలనీలో ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బి. వెంకటరమణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విస్తృతంగా పర్యటించింది. ఇంటింటికీ వెళ్లి బడి వయసు పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.
* ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు…
ఈ బడిబాట కార్యక్రమంలో టీపీటీఎఫ్ (TPTF) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి. తిరుపతిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. “ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తోంది. ఉదయాన్నే ఉచిత అల్పాహారం, వారంలో మూడు రోజులు రాగిజావ, మరో మూడు రోజులు పాలు, పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులను ప్రభుత్వం అందజేస్తోంది” అని ఆయన వివరించారు.
* ప్రత్యేక ఆకర్షణగా ఎన్సీసీ, కంప్యూటర్ కోర్సులు…
ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ (NCC) మరియు కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉచిత నాణ్యమైన విద్యాబోధనను ప్రజలు సద్వినియోగం చేసుకుని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
ఈ విజయవంతమైన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సభ్యులు శ్రీదేవి, సాగర్, జోష్నలతో పాటు స్థానిక వార్డు ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
