CM Revanth Reddy Congress Reason
ఆకేరు న్యూస్, డెస్క్: ‘ది హిందూ హడిల్’ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక ఉన్న బలమైన కారణాలను పంచుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేసీఆర్ పాలనపై పోరాటం నుంచి బ్యూరోక్రాట్లతో తనకున్న అనుభవాల వరకు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
* కేసీఆర్‌పై పోరాటం కోసమే ఆ నిర్ణయం..
తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక బలమైన, రాజీలేని పోరాటం జరగాలని రాష్ట్ర ప్రజలు బలంగా ఆకాంక్షించారు. ప్రజా భావనను గౌరవిస్తూనే నేను తెలుగుదేశం పార్టీ (TDP)కి రాజీనామా చేశాను. ఆ సమయంలో నా ముందు రాజకీయంగా ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కానీ, నేను కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడాలని నిర్ణయించుకున్నాను” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
* సోనియా గాంధీ 60 ఏళ్ల కలను నెరవేర్చారు…
తాను కాంగ్రెస్‌ను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాన్ని సీఎం వివరించారు. “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కంటున్న ప్రత్యేక రాష్ట్ర కలను సోనియా గాంధీ గారు సాకారం చేశారు. అందుకే ప్రజల ఆకాంక్షను గౌరవించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను” అని ఆయన స్పష్టం చేశారు.
* బ్యూరోక్రాట్స్‌పై రేవంత్ చమత్కారం..
ఇదే వేదికపై ఐఏఎస్, ఐపీఎస్ (బ్యూరోక్రాట్స్) అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. “బ్యూరోక్రాట్స్ చాలా ఇంటెలిజెంట్. అందుకే నేను వారితో జరిగే మీటింగ్స్‌లో మొదట ఏమీ మాట్లాడను. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత, కేవలం మీటింగ్ ముగింపులో (క్లోజింగ్‌లో) మాత్రమే నా నిర్ణయాన్ని చెప్తాను” అంటూ చమత్కరించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వైరల్‌గా మారాయి.
