warangal auto drivers protest against Uber
* హనుమకొండలో ఉబర్ బైక్ లాంచ్ కార్యక్రమాన్ని అడ్డుకున్న ఆటో యూనియన్ డ్రైవర్లు
అకేరు న్యూస్, హన్మకొండ : హనుమకొండ జిల్లాలో ఉబర్ బైక్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం నిర్వహించిన లాంచింగ్ కార్యక్రమాన్ని వివిధ ఆటో యూనియన్లకు చెందిన డ్రైవర్లు అడ్డుకున్నారు. బైక్ ట్యాక్సీల నిర్వహణ వల్ల తమ ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. బైక్ రైడర్ల కారణంగా తమకు వచ్చే ఆదాయం రోజురోజుకు తగ్గిపోతోందని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు నిరసనలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపించారు.
అలాగే సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు బైక్ ట్యాక్సీల నిర్వహణపై తగిన నిర్ణయం తీసుకుని తమ జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు.
ఉబర్ బైక్ లాంచ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్లతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఆటో డ్రైవర్ల సమస్యపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
