Rayaparthy Bus Stand Problems
ఆకేరు న్యూస్, వరంగల్: రాయపర్తి మండల కేంద్రంలో ప్రయాణికుల కష్టాలు అరణ్యరోదనగా మారాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే స్థానిక బస్టాండ్ ప్రాంగణంలో కనీస సౌకర్యాలు కరువవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడేళ్లు గడిచినా ముందడుగు పడని వైనం
గత మూడు సంవత్సరాల క్రితం ప్రయాణికుల అవస్థలను గుర్తించి, బస్టాండ్ వెనుక భాగంలో రూ. 5 లక్షల అంచనా వ్యయంతో మూత్రశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధులు మంజూరై, పనులు ప్రారంభమైనప్పటికీ.. ఏమైందో ఏమో కానీ ఆ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది.
* మహిళలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం…
పనులు సగంలోనే ఆగిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పిచ్చిమొక్కలతో, అపరిశుభ్రంగా తయారైంది. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, వృద్ధులు మరియు చిన్నపిల్లల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపమా? లేక నిధుల కొరతా? అన్నది తెలియడం లేదు కానీ, మూడేళ్లుగా ఈ సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* ఇప్పటికైనా స్పందించండి…
లక్షల రూపాయల ప్రజాధనం వృధాగా పడి ఉండటంపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, మధ్యలోనే ఆగిపోయిన మూత్రశాలల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రాయపర్తి మండల కేంద్ర ప్రయాణికులు మరియు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
