* నమోదు చేసే అవకాశాల పరిశీలన
* కోర్టులో పిటిషన్ దాఖలు
* ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ!
* అమెరికాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ల నమోదు చేయాలని యోచిస్తున్నారు. ఈమేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో కీలకమైన డేటా ధ్వంసం, సీడీలు బద్దలు కొట్టడం తదితర నేరారోపణల కింద ఐటీ యాక్ట్ 66ఎఫ్, ఐటీ యాక్ట్ 70 కింద కేసుల నమోదును పరిశీలిస్తున్నారు. నేరం నిరూపణ అయితే ఈ సెక్షన్ల కింద నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
ప్రభాకర్ రావును కార్నర్ చేసిన పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు SIB చీఫ్ ప్రభాకర్‌రావుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభాకర్‌రావు విదేశాలకు పారిపోయారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభాకర్‌రావు ఆచూకీపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఆరు నెలల విజిటింగ్ వీసా మీద అమెరికా వెళ్లినట్లు గుర్తించారు. ఇప్పటికే రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.
——————————–