
జీతాల పెంపు, క్రమబద్ధీకరణ కోసం నిరస చేస్తున్న అసిస్టెంట్ పోలీసులపై జార్ఖండ్ పోలీసుల లాఠీచార్జి.
* రాంచీలో రోడ్డెక్కిన అసిస్టెంట్ పోలీస్ లు
* సీఎం ఇల్లు ముట్టడికి ప్రయత్నం
* పోలీస్ల లాఠీ చార్జీ
ఆకేరు న్యూస్, డెస్క్ : పోలీస్ల పై పోలీస్ల లాఠీచార్జీ చేశారు. ఇదేంటి పోలీస్లపై పోలీసులు లాఠీ చార్జీ చేయడమేంటి అనుకుంటున్నారా..! నిజమే శుక్రవారం ఈ సంఘటన జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని రాంచీలో జరిగింది. తమ డిమాండ్ల సాధన కోసం అసిస్టెంట్ పోలీసులు ఆందోళన బాట పట్టారు. గత కొంత కాలంగా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో రాంచీలోని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆందోళన కారులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను చేధించుకుని సీఎం ఇంటి వైపుగా దూసుకెళ్ళారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. లాఠీలను ఝళిపిస్తూ ఆందోళన కారులను చెల్లా చెదరు చేశారు.
* 10 వేల జీతంతో ఎట్లా బ్రతకాలి..?
జార్ఠండ్ రాష్ట్రంలోని 12 మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 2500 మంది అసిస్టెంట్ పోలీస్లను నియమించారు. 2017లో ఏర్పాటు చేసిన అసిస్టెంట్ పోలీసులు నక్సలైట్ కార్యకలాపాలు, శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వీరి సర్వీస్ ఏడాదికోసారి పొడిగించాల్సి ఉంటుంది. నెలకు కేవలం రూ. 10 వేల జీతంతో పనిచేస్తున్నారు. వచ్చే నెల అంటే ఆగష్టు 9 న వీరి పదవీ కాలం ముగియనుంది. తమ సర్వీస్ రెగ్యులరైజ్ చేయడంతో పాటు జిల్లా పోలీసుల మాదిరిగా తమకు ప్రసూతి, మెడిక్లెయిమ్, విధి నిర్వహణలో మృత్యువాత పడితే పరిహారం ఇవ్వడం లాంటి సౌకర్యాలను తమకు కల్పించాలని జార్ఖండ్ పోలీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
అదే విదంగా నెలకు కేవలం పదివేల రూపాయల జీతంతో పనిచేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం పెంచడంతో పాటు సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్లతో 2020, 2021 సంవత్సరాల్లో కూడా ఆందోళన చేశారు. 2023లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి మాట తప్పారని అసిస్టెంట్ పోలీస్ అసోసియేషన్ అంటోంది. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు..
——————————————————