Ponguleti Srinivas Reddy
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దళితులు, గిరిజనుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. వారి అంగుళం భూమిని కూడా తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ.. భూ రికార్డుల పరిశీలన, సర్వేలు, భూ సమస్యల పరిష్కార ప్రక్రియలను ప్రజల భూములు తీసుకునే చర్యలుగా భావించవద్దన్నారు. భూముల హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, వివాదాలను పరిష్కరించడం, అర్హులైన వారికి హక్కులను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
దళితులు, గిరిజనులు భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు ఎవరినైనా ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సమస్యలపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం భయాందోళనలు సృష్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
రీ-సర్వే ద్వారా దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని పొంగులేటి తెలిపారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రామాలు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో భూ సమస్యలకు పరిష్కారం చూపించినట్లు చెప్పారు.
గతంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చిందని, అది అమలు కాలేదని మంత్రి విమర్శించారు. దళిత, గిరిజనుల భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
