* పట్టుబట్టి వియ్యంకుడికి ఇప్పించుకున్న ఖమ్మం ఎంపీ టికెట్
* కలిసి వచ్చిన రామ సహాయం
* ఇక ఖమ్మం జిల్లాలో తిరుగు లేని పవర్ సెంటర్
ఆకేరు న్యూస్ , ఖమ్మం :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి తన సత్తా చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పట్టును నిలుపుకున్నారు. చివరివరకు తీవ్ర ఉత్కంఠ రేపిన ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ టికెట్‌ను తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి ఇప్పించుకున్నారన్న చర్చ ఖమ్మం జిల్లాలో జరుగుతోంది. ఈ పరిణామాలతో విలక్షణరాజకీయాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శకం ఆరంభమైనట్టుగా చెబుతున్నారు. మరింత లోతుగా కమ్మ సామాజిక వర్గ ప్రాభవం ఉన్న ఖమ్మం జిల్లాలో రెడ్డి ఆధిపత్యం మొదలైనట్టే నంటున్నారు. గత రెండు నెలలుగా ఖమ్మం కాంగ్రెస్ టికెట్‌పై అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ టికెట్‌ను తమ వారికి ఇప్పించుకునేందుకు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వచ్చారు. భట్టి తన సతీమణి నందినిని రేసులో దించగా, తుమ్మల తన కుమారుడు యుగంధర్‌ను, పొంగులేటి తన తమ్ముడు ప్రసాదరెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. వీరు టికెట్ కోరుతూ పార్టీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. వీరికి తోడు ఖమ్మం జిల్లాకే చెందిన రాయల నాగేశ్వరరావు, వీవీసీ రాజా, సీతారాములు వంటి వారు టికెట్ ఆశించారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం నుంచి ఎంపీగా మూడు సార్లు ప్రాతినిథ్యం వహించిన రేణుకాచౌదరి, టీపీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు కూడా టికెట్ ఆశించారు. మధ్యలో నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి , కమ్మ సామాజిక వర్గ పెద్ద దిక్కుగా పిలవబడే మండవ వెంకటేశ్వరరావు పేరు సైతం ప్రచారంలోకి వచ్చింది. అప్పుడప్పుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు సైతం ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలా తెలంగాణలో ఏ ఎంపీ సీటుకు లేని క్రేజీ ఖమ్మం సీటుకు ఏర్పడింది. స్థానికేతర నేతలను సైతం ఆదరించే చరిత్ర ఖమ్మం జిల్లాకు ఉండటంతో కాంగ్రెస్ టికెట్‌కు మునుపెన్నడూ లేని డిమాండ్ ఏర్పడింది. సీనియర్ నాయకులు, ఆర్థిక బలవంతులు పోటీపడుతుండటంతో చాలా సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న అనేక మంది ఆశావహులు సైలెంట్ గా సైడ్ అయిపోవాల్సి వచ్చింది.
* కలిసి వచ్చిన రామ సహాయం
ఖమ్మం టికెట్‌పై మొదటి నుంచీ కన్నేసిన పొంగులేటి.. ఎక్కడా చేజారకుండా ఎత్తులు వేస్తూ వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వైపు నుంచి పోటీ వున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా, ముందుజాగ్రత్తగా తన వియ్యకుండు రామసహాయం రఘురాంరెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. రఘురాంరెడ్డి తండ్రి రామసహాయం సురేందర్‌రెడ్డి ఉమ్మడి వరంగల్జిల్లా నుంచి నాలుగుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఇందిరాగాంధీ హయాం నుంచే కాంగ్రెస్‌లో ఆయనకు సీనియర్ నేతగా పేరున్నది. వయోభారం కారణంగా ఆయన క్రియశీల రాజకీయాలకు రెండు దశాబ్దాలుగా దూరంగా వున్నారు. అయితే ఎందువల్లనో ఆయన వారసుడిగా కుమారుడు రఘురాంరెడ్డి వెలుగులోకి రాలేకపోయారు. ఈ క్రమంలో పొంగులేటితో రఘురాంరెడ్డి వియ్యం అందుకోవడం కలిసివచ్చినట్లయింది. రఘురాంరెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డికి పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డిని ఇచ్చి వివాహం జరిపించారు. ఖమ్మం టికెట్ వ్యవహారంలో ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులకు ఎవరికీ టికెట్ ఇవ్వకూడదని అధిష్ఠానం నిర్ణయించి భట్టికి, తుమ్మలకు మొండిచేయి చూపడంతో పాటు పొంగులేటి తమ్ముడు ప్రసాదరెడ్డిని కూడా పక్కనపెట్టింది. ఇక్కడే పొంగులేటి అప్రమత్తమై వ్యూహాత్మకంగా తన వియ్యకుండు రఘురాంరెడ్డిని తెరపైకి తీసుకువచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు రఘురాంరెడ్డికి టికెట్ ఖరారైన నేపథ్యంలో.. రామసహాయం సురేందర్‌రెడ్డి సేవలకు గుర్తింపుగా, ఆయన వారసుడిగా టికెట్ ఇచ్చినట్టు చెప్పుకునే అవకాశం అధిష్ఠానానికి వచ్చింది. బయటకు అలా కనిపించినప్పటికీ పొంగులేటి పట్టుదల వల్లే రఘురాంరెడ్డికి టికెట్ దక్కిందనేది ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాతో పాటు, తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పొంగులేటి తన ఆర్థిక చేయూతతో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలోనే ఒక ప్రచారం ఉంది. ఈ కోణంలోనే ఆయన మాటకు అధిష్ఠానం వద్ద ఎంతో ‘విలువ’ ఉన్నట్టు చెబుతున్నారు. తాజా పరిణామంతో పొంగులేటి గ్రాఫ్ మరింత పెరగగా, ఖమ్మం జిల్లాలో ఆయన ఎదురులేని శక్తిగా తయారయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
—————————————-