Puligilla Parakala Road Repairs
* మరమ్మతులకు ముందుకొచ్చిన పులిగిల్ల ట్రాక్టర్ యూనియన్
అకేరు న్యూస్, హన్మకొండ : పులిగిల్ల గ్రామం నుంచి పరకాల వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దెబ్బతినడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పులిగిల్ల గ్రామ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు స్పందించారు. గురువారం గ్రామ పరిధిలో గుంతలు పడిన రహదారిని పరిశీలించిన యూనియన్ సభ్యులు.. తమ ట్రాక్టర్ల సహకారంతో గుంతల్లో మట్టిని నింపి తాత్కాలికంగా రహదారిని సరిచేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించి గుంతలను మట్టితో పూడ్చిన పులిగిల్ల గ్రామ ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని, సంబంధిత అధికారులు స్పందించి పులిగిల్ల–పరకాల రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
