RK ROJA DAUGHTER ANSHU MALIK WINS Herman B Wells Award
*అమెరికాలో సత్తా చాటిన రోజా కుమార్తె
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. తన అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై భారతీయ జెండాను రెపరెపలాడించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ (బ్లూమింగ్ టన్) ఏటా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేసే ‘హెర్మన్ బి వెల్స్’ (Herman B Wells Award 2026) పురస్కారానికి అన్షు ఎంపికయ్యారు. విశేషమేమిటంటే, ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా అన్షు మాలిక చరిత్ర సృష్టించారు.
*యూనివర్సిటీ బోర్డుపై అన్షు పేరు..
ఈ అవార్డును యూనివర్సిటీ ప్రతి ఏటా కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ప్రదానం చేస్తుంది. అకడమిక్స్ (చదువు), నాయకత్వ లక్షణాలు (Leadership), మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఈ పురస్కారం దక్కుతుంది. ఈ అవార్డు సాధించిన అన్షు మాలిక పేరును యూనివర్సిటీలోని గౌరవ బోర్డుపై బంగారు ఫలకంపై శాశ్వతంగా లిఖించనున్నారు. ఇది ఆమె జీవితకాలపు గౌరవంగా నిలిచిపోనుంది.
*R k రోజా ఎమోషనల్
తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా పురస్కారం..
శనివారం అమెరికాలో జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవంలో తల్లి రోజా, తండ్రి సెల్వమణి స్వయంగా పాల్గొన్నారు. తన కుమార్తె సాధించిన ఈ అద్భుత విజయాన్ని చూసి రోజా ఎమోషనల్ అయ్యారు. “ఒక చిన్న కలగా మొదలైన నీ ప్రయాణం, ఈ రోజు ఎందరికో స్ఫూర్తినిచ్చే స్థాయికి చేరింది. నీ కఠోర శ్రమ, అంకితభావమే నిన్ను ఇక్కడికి చేర్చాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నిన్ను చూస్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది” అంటూ సోషల్ మీడియా వేదికగా అన్షును అభినందించారు.
*అన్షు సాధించిన మరిన్ని విజయాలు
ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అన్షు, కేవలం చదువులోనే కాకుండా వివిధ రంగాల్లో ఇప్పటికే తన మార్కును చాటారు. Maureen Biggers Award: గతంలో ‘మారిన్ బిగ్గర్స్’ లీడర్షిప్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
Global Entrepreneur Award: నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్లో సామాజిక ప్రభావం విభాగంలో అవార్డు అందుకున్నారు.
రచయిత్రిగా: ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ అనే నవలను రాసి దక్షిణ భారతదేశంలో ఉత్తమ యువ రచయిత్రిగా గుర్తింపు పొందారు.
గ్రేస్ హాపర్ స్కాలర్షిప్: ప్రతిష్టాత్మక గ్రేస్ హాపర్ స్కాలర్షిప్ను కూడా దక్కించుకున్నారు.
అన్షు మాలిక సాధించిన ఈ ఘనతపై నెటిజన్లు, సినీ రాజకీయ ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
