Minister Seethakka
* పట్టణ విద్యార్థులకు దీటుగా మామిడిగూడెం చిన్నారులు
* కంటైనర్ పాఠశాలలను ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు : ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గిరిజన గూడాల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ఏటూరునాగారం మండలం మామిడిగూడెం గ్రామంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సమకూర్చిన 15 లక్షల సి.ఎస్.ఆర్. నిధులతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, కొమరం భీమ్‌నగర్ కాలనీలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.5 లక్షల సి.ఎస్.ఆర్. నిధులతో ఏర్పాటు చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా ప్రతి చిన్నారికి చదువుకునే అవకాశం ఉండాలన్నారు. పాఠశాలలు, రహదారులు, విద్యుత్ సౌకర్యం లేని మారుమూల అటవీ ప్రాంతాల్లోనూ విద్యకు ఆటంకం కలగకుండా అవసరమైన చోట కంటైనర్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గుత్తికోయ ఆదివాసీ గూడెమైన మామిడిగూడెంలో పరిమిత సౌకర్యాల మధ్య విద్యార్థులు ప్రదర్శిస్తున్న ప్రతిభ ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పాటలు, కథలు, సంభాషణలతో విద్యార్థులు ఆకట్టుకున్నాయాని ప్రశంసించారు. పట్టణ ప్రాంతాల విద్యార్థులకు దీటుగా గిరిజన చిన్నారులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ఇర్ప మధు, సారంగం సేవలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
పట్టుదల కలిగిన గురువు విద్యార్థుల జీవితాలను మార్చగలరని, దేశానికి గొప్ప శాస్త్రవేత్తలు, విద్యావంతులు, ఉన్నత వ్యక్తులను అందించగల శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు.
జిల్లాలో విద్యావ్యవస్థ బలోపేతానికి పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎ. సిద్ధార్థరెడ్డి, విద్యాశాఖ అధికారుల కృషిని మంత్రి అభినందించారు.
మామిడిగూడెంలో త్వరలో బోరు మంజూరు చేసి తాగునీటి సదుపాయం కల్పించడంతోపాటు సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు పొందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ సహకారంతో అంబులెన్సులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేలా మార్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు.
విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు.ఈ కార్యక్రమాల్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీ మనన్ భట్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ. సిద్ధార్థరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, ఉల్లాస్ సమన్వయకర్త కృష్ణబాబు, తహసీల్దార్, మండల విద్యాధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
* మల్లూరు ఆలయాన్ని అభివృద్ధి చేయాలి..
మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లోని సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షిస్తూ, క్షేత్ర విశిష్టత ప్రతిబింబించేలా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు.
గురువారం మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ని మంత్రి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్ ,దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మల్లూరు క్షేత్రంలోని దట్టమైన అడవులు, వందల ఏళ్ల నాటి వృక్షాలు, స్వచ్ఛమైన గాలి, సహజ జలవనరులతో కూడిన ఆహ్లాదకర వాతావరణం
ఎంతో అరుదైనదని పేర్కొన్నారు.
ఆలయ పరిసరాల్లోని ప్రకృతి సహజత్వానికి ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తుల అవసరాలు, భవిష్యత్తులో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి ప్రదేశాలు, వాహనాల నిలుపుదల, రాకపోకలకు అనువైన మార్గాలు వంటి సౌకర్యాలకు మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యం చేస్తున్నట్లు తెలిపారు.
ఆలయ చరిత్ర, పురాణ నేపథ్యం, స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేసేలా ఆకర్షణీయమైన శిల్పాలు, విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మల్లూరు క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. మొదట ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న గోశాలకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆలయ ఈ ఓ వీరస్వామి,తహసిల్దార్ రవీందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
