* దేవుడి కోసం కర్రలతో సమరం
* బన్నీ ఉత్సవంలో 100 మందికి పైగా గాయాలు
* రక్తసిక్తమైన దేవరగట్టు
ఆకేరు న్యూస్, డెస్క్: దేవరగట్టు.. కొండపై స్వామివారు.. సంవత్సరమంతా నిశ్శబ్ధంగా ఉండే ఆ ప్రాంతం.. దసరా రోజున యుద్ధభూమిగా మారుతుంది. రాజమౌళి సినిమా మాదిరి భారీ కురుక్షేత్రమే జరుగుతుంది. ఎవరి చేతిలో చూసినా కర్రలు.. వందలాది మంది గ్రూపులుగా విడిపోయి సమరం చేస్తారు. కొండపై కొలువై ఉన్న మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల కోసం కొట్టుకుంటారు. దాన్నే కర్రల సమరం లేదా బన్నీ ఉత్సవం అంటారు. దసరా వస్తోందంటే.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవం కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. దాని కోసం కథలు కథలుగా చెప్పుకుంటారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా, ఎంతలా అవగాహన కల్పించినా దసరా రోజున రక్తం చిందడం ఆగడం లేదు. స్వామి కోసం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఇక్కడ జరిగిన బన్సీ ఉత్సవంలో 100 మందికిపైగా గాయాలపాలయ్యారు.
అసలు ఎందుకు కొట్టుకుంటారు..
కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం, హోలగొంద మండలం, దేవరగట్టు కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో మాళమ్మ, మల్లేశ్వరస్వామి కొలువై ఉంటారు. దసరా రోజున స్వామివార్ల కల్యాణం జరిపిస్తుంటారు. పాదాలగుట్ట, రక్షపడ, శమీవృక్షం, బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఓ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మొత్తం ఎనిమిది గ్రామాల ప్రజలు పోరాడుతారు. ఇందులో మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడతారు. దీన్నే బన్నీ ఉత్సవంగా పేర్కొంటారు. ఏటా దసరా సందర్భంగా కర్రల సమరం జరగడం సంప్రదాయంగా వస్తుంది. ఇక్కడ స్వామి దేవతా మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపున.. అరికెర, అరికెరతండా, కురుకుంద, బిలేహాల్, సుళువాయి, ఎల్లార్తి, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపున కర్రలతో కొట్లాటకు దిగుతారు.
రక్తం చిందడానికి కారణం ఇదే..
దేవరగట్టు ప్రాంతంలో ఉన్న కొండల్లో ఋషులు, తపస్సు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారు. అదే ప్రాంతంలో మని, మల్లాసురులు అనే రాక్షసులు ఉండేవారట. లోక కల్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజ కార్యక్రమాలకు వారు భంగం కలిగిస్తూ ఉండేవారట. దీంతో ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, వారికి అడ్డుకట్ట వేయడం విష్ణుమూర్తి వల్లే అవుతుందని చెప్పారట. దీంతో మునులు వైకుంఠానికి వెళ్లి విష్ణుదేవుడిని శరణు వేడుకుంటూ తమ బాధను విన్నవించుకున్నారట. అయితే, మని మల్లసురులు శివుని భక్తులని వారిని సంహరించడం తన వాళ్ళ కాదని మీరు పరమేశ్వరుడి వద్దకు వెళ్లాలని విష్ణుమూర్తి సూచించారట. దీంతో కైలాసం వెళ్లి రాక్షసుల బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటారట. దీంతో కాల భైరవుడి అవతారంలో మని, మల్లాసూరులు అనే రాక్షసులను శివుడు అంతమొందిస్తాడు. రాక్షసులు ప్రాణాలు విడిచే సమయంలో తమకు ఏటా భక్తుల రక్తాన్ని ఓ కుండ నిండా సమర్పించాలని కోరుకున్నారట. అందుకు శివపార్వతులు అంగీకరించారని స్థలపురాణం చెబుతోంది. ఆ క్రమంలోనే ఉత్సవ మూర్తులు తమ గ్రామానికే దక్కాలంటూ ఆయా గ్రామాల భక్తులు తలపడే సందర్భంలో రక్తం చిందుతుందని భావిస్తారు.
ఈ ఏడు కూడా..
ఈ ఏడు కూడా దేవరగట్టులో కర్రల సమరం జరిగింది. భక్తుల విశ్వాసాల మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శాంతియుతంగా జరుపుకోవాలని సూచించింది. 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయినా, దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది. బన్నీ ఉత్సవంలో సుమారు 100 మంది గాయపడ్డారు. ఎప్పటిలాగే దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పర్వదినాన అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, మరో 3 గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగడంతో రక్తం చిందింది. బన్నీ ఉత్సవాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. సుమారు రెండు లక్షల మందికిపైగా భక్తులు ఈ ఉత్సవాన్ని చూసేందుకు తరలివచ్చినట్లు అంచనా.
…………………………………………..