Byju Founder Raveendran Jail Sentence
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ ఎడ్టెక్ దిగ్గజం ‘బైజూస్’ (Byju’s) వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు అంతర్జాతీయంగా భారీ చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానాన్ని ధిక్కరించిన కేసులో (Contempt of Court) ఆయనకు సింగపూర్ కోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆస్తుల వివరాలను వెల్లడించకుండా తప్పించుకుంటున్నందుకు ఈ శిక్ష ఖరారు చేశారు.
*ఖతార్ సంస్థ పిటిషన్…
బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్న క్లిష్ట సమయంలో ‘ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ’ (QIA) కి చెందిన అనుబంధ సంస్థ ‘ఖతార్ హోల్డింగ్స్’ (qatar holdings) బైజూస్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే కంపెనీలో పారదర్శకత లోపించడం, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో సదరు ఇన్వెస్టర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 2024 నుండి బైజూ రవీంద్రన్ తన వ్యక్తిగత, వ్యాపార ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం పలుమార్లు ఆదేశించింది. అయితే, ఈ ఉత్తర్వులను ఆయన బేఖాతరు చేయడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
*శిక్షకు అసలు కారణం ఇదే…
రవీంద్రన్‌కు కేవలం ఆస్తుల వివరాలు దాచడమే కాకుండా, ‘బీఆర్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్’ (Beeaar Investco Pte) అనే కార్పొరేట్ సంస్థపై ఉన్న లీగల్ ఓనర్షిప్ (చట్టపరమైన యాజమాన్యం) పత్రాలను సమర్పించనందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ సంస్థ ద్వారానే బైజూస్‌కు చెందిన ఒక అనుబంధ కంపెనీలో కీలక షేర్లను హోల్డ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఖతార్ హోల్డింగ్స్ తరఫున ప్రముఖ లా ఫర్మ్ ‘డ్రూ అండ్ నాపియర్’ వాదించగా, బైజూస్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున ‘ఫెర్వెంట్ ఛాంబర్స్’ వాదనలు వినిపించాయి.
*సింగపూర్ కోర్టు కీలక ఆదేశాలు..
బైజూ రవీంద్రన్ ఆలస్యం చేయకుండా సింగపూర్ అధికారుల ముందు తక్షణమే లొంగిపోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు కోర్టు ఖర్చుల నిమిత్తం 90,000 సింగపూర్ డాలర్లు (సుమారు 70,500 అమెరికన్ డాలర్లు) చెల్లించాలని ఆదేశించింది.
*అంతర్జాతీయంగా బిగుస్తున్న ఉచ్చు..
ఒకప్పుడు 22 బిలియన్ డాలర్ల (రూ. 1.8 లక్షల కోట్లకు పైగా) విలువతో భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్‌గా వెలిగిన బైజూస్, ప్రస్తుతం పతనావస్థకు చేరింది. ఇప్పటికే అమెరికాలో 1.2 బిలియన్ డాలర్ల (సుమారు ₹10,000 కోట్లకు పైగా) భారీ రుణం చెల్లింపుల వివాదంలో అక్కడి కోర్టు కూడా రవీంద్రన్‌ను తప్పుపట్టింది. దాదాపు 533 మిలియన్ డాలర్లను రహస్యంగా మళ్లించారనే ఆరోపణలపై కూడా అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతోంది.
భారతదేశంలోనూ కంపెనీ దివాలా (Insolvency) ప్రక్రియను ఎదుర్కొంటోంది. ప్రస్తుతానికి బైజూ రవీంద్రన్ ఎక్కడ ఉన్నారనేది స్పష్టత లేదు. లీగల్ వర్గాల్లో సస్పెన్స్ కొనసాగుతుండగా, ఈ కోర్టు తీర్పుపై బైజూస్ ప్రతినిధులు గానీ, రవీంద్రన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ తాజా సింగపూర్ కోర్టు తీర్పు బైజూ రవీంద్రన్ చుట్టూ చట్టపరమైన ఉచ్చును మరింత బిగించినట్లయింది.
