BRS leaders suspension controversy
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పార్టీ ఆవిర్భావం నుండి వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల సస్పెన్షన్ లు.. పార్టీ బలోపేతానికా ? లేదా పార్టీ విచ్చిన్నానికా ? అని బిఆర్ఎస్ నాయకులు మండల ఇన్చార్జిని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్యను ప్రశ్నించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చిన్న పెండ్యాలకు చెందిన జనగామ యాదగిరి, మల్కాపూర్ కు చెందిన కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, శ్రీపతి పల్లికి చెందిన రంగు హరీష్ లను మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మండల ఇంచార్జ్ వాట్సాప్ (సోషల్ మీడియా) గ్రూపులో పెట్టడం పట్ల బిఆర్ఎస్ శ్రేణులు భగ్గున మండి పడ్డాయి. ఈ మేరకు మండలంలోని చిన్న పెండ్యాల లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జనగామ యాదగిరి, ఇల్లందుల సుదర్శన్, కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, రంగు హరీష్, పుట్ట బాపురెడ్డిలు మాట్లాడుతూ టిఆర్ఎస్ బలోపేతానికి, కార్యకర్తల సమస్యలను తెలుసుకుంటూ వారికి మనోధైర్యం ఇవ్వడమే కాకుండా రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆందోళన చేసాం తప్ప పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదని వివరించారు. ఉపముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన మీకు ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏమిటి ? పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని వారు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ అంటే నలుగురితో మీటింగ్ లు పెట్టడం, ఫోటోలు దిగడం కాదన్నారు. 2001 నుండి పార్టీలో ఉన్నాం, పార్టీ కోసమే పని చేస్తున్నాం, పార్టీ టిక్కెట్ ఇచ్చిన వ్యక్తులను గెలిపించుకుంటున్నాం అలాంటిది మమ్మల్ని సస్పెన్షన్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. అసలు పార్టీలో మీరేంటో మీకే తెలియని అయోమయ పరిస్థితి అలాంటప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం, హక్కు ఎక్కడిది అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి సహకారంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఆపద వస్తే ఆదుకుంటున్నాం, సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నాం అంతే తప్ప పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ చేపట్టలేదనే విషయాన్ని గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు హితబోధ చేశారు. నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన ఇద్దరు ముగ్గురు చెప్పిన మాటలు విని పార్టీ కోసం పనిచేసే నాయకుల మనోభావాలు దెబ్బ తీయవద్దని కోరారు. ప్రతిపక్ష పార్టీగా, మాజీ ఎమ్మెల్యేగా గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్ పూర్ కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్, గుంపుల రవీందర్ రెడ్డి, నోముల మల్లారెడ్డి, పుట్ట బాపురెడ్డి, ఉపసర్పంచ్ సంతోష్, తాళ్లపల్లి క్రాంతి కుమార్, ఎడ్ల రాజేష్, ఉడుత అశోక్, శాగ వెంకటేశ్వర్లు, సుగ్రీవ చారి, శ్యామల రాము, సాగ శీను, తాళ్లపల్లి సమ్మయ్య, బొంబాయి శీను, బూర్ల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
*
