Kadiyam Srihari development plan Station Ghanpur
* ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ అభివృద్ధి
… ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రజల భాగస్వామ్యం, అధికారుల సహకారంతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి సిరిపురం గార్డెన్స్ లో “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ….. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం అన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన నాటి నుండి 3 అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అందులో మొదటిది రైతు సంక్షేమం. రైతుకు అండగా నిలవాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలి అనే ఉద్దేశ్యంతో రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సన్నాలకు బోనస్, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యంకు మద్దతు ధర అందిస్తున్నట్లు తెలిపారు. రెండోది మహిళా సంక్షేమం మహిళా సాధికారాతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటుతో కోటి మంది మహిళలను కొటశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. మూడోది పేద వర్గాల సంక్షేమం. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేద వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోతే వారికి 15 రోజులలో 5 లక్షలు ఆర్థిక సహాయం అందించే ఇందిరా కుటుంబ భీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వితంతు మహిళలకు మొదటగా పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో 350 కోట్లతో దేవాదుల కాలువల మారమ్మత్తుతో గోదావరి జలాలు తీస్తోకువెళ్లినట్లు తెలిపారు.
45 కోట్లతో 100పడకల ఆసుపత్రి నిర్మాణం, 26 కోట్లతో ఇంటిగ్రెటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నాయని వివరించారు. నిజాయితీగా పని చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. తాను 32 ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నని ఈ రోజు కడియం శ్రీహరి అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందని దానికి కారణం నీతి, నిజాయితీగా పని చేయడమే అని స్పష్టం చేశారు. సర్పంచులు, కౌన్సిలర్లు మీ మీ గ్రామాలలో, వార్డులలో అభివృద్ధి చేసేందుకు పనులు చేసేందుకు నిధులు తీసుకువచ్చే బాధ్యత నాదని నిజాయితీగా అమలు చేసే బాధ్యత మీదని అన్నారు. వెల్లడించారు. ఆర్డీవో డి ఎస్ వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, వివిధ శాఖల డీఈలు, ఏఈలు, సర్పంచులు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
