
* టీసీఎస్ సీఈవో వ్యాఖ్యల మర్మం అదేనా?
* సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు జాగ్రత్తగా పసిగట్టాలని నిపుణుల సూచన
* టెకీలకు లే ఆఫ్‌ల టెన్షన్
* టీసీఎస్ నిర్ణయంతో ఇంజనీర్లు కుదేలు
* మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహా టెక్ సంస్థలన్నీ అదే బాట
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు కష్టకాలం మొదలైంది. ఐదంకెల జీతం సంగతి దేవుడెరుగు.. అస్సలు ఉద్యోగం ఉంటుందో లేదో అన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. టెక్ దిగ్గజ కంపెనీలు వేలాది మందికి ఉద్వాసన పలుకుతున్నాయి. భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన మొత్తం ఉద్యోగులలో రెండు శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివాసన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
అప్డేట్ కావాల్సిందే
ఈ సందర్భంగా కృతివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం ఉంది కానీ.., నైపుణ్యం సరిగ్గా లేని వారిని తొలగించి, టాలెంట్, సామర్థ్యం ఉన్న కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అంటే.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులు కూడా మార్చాల్సిన అవసరం ఉందన్న విషయం అర్థం అవుతోంది. టెక్ కంపెనీల్లో లే అఫ్ లలో ఎక్కువగా మిడ్, సీనియర్ లెవల్ ఎంప్లాయిస్ లపైనే ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. అప్ డేట్ కాకుండా, ఒకే వ్యవస్థపై ఆధారపడి పనిచేసే వారికి ఇబ్బందులు తప్పవన్నట్లు స్పష్టం అవుతోంది. ఉద్యోగులు వినియోగిస్తున్న కంప్యూటర్లు, ల్యాప్ టాప్లలో సాఫ్ట్ వేర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవున్నట్లే.. ఉద్యోగులు కూడా ఉద్యోగభద్రత పొందాలంటే అప్డేట్ కావాల్సిందేనని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.
టాలెంట్ ఉంటేనే మనుగడ
టీఎస్ సేకాదు.. ఇంటెల్ 24,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని ఉద్యోగాల తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లో అయితే ఇప్పటికే తొలగింపు ప్రారంభమైంది. మరో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ జీతాల పెంపును నిలిపివేసింది. అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉండక తప్పదని, దానిలోభాగంగానే టాలెంట్, సామర్థ్యం ఉన్న వారికి తీసుకుంటామని టీసీఎస్ సీఈఓ వ్యాఖ్యానించారు. దీనికి తోడు ప్రపంచ ఆర్థిక మందగమనం, కంపెనీల ఖర్చుల తగ్గింపు కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
కృత్రిమ మేధ Vs మానవ మేధ..
కృత్రిమ మేధ (AI) రాక కూడా ఉద్యోగుల తొలగింపులో ప్రముఖ కారణంగా చెప్పవచ్చు. ఏఐ రాకతో క్లయింట్లు 20 నుంచి 30 శాతం తక్కువకే ప్రాజెక్టులు చేయాలని అడుగుతున్నారని కృతివాసన్ పేర్కొన్నారు. ఈక్రమంలో తామూ ఖర్చులు తగ్గించుకోక అనివార్యమనే విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐ తో ఎంత మేలు జరగనుందోకానీ.. ప్రస్తుతానికి పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుంటున్నాయి. అంటే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై మాత్రం పెను ప్రభావం చూపుతోంది. అమెజాన్, గూగుల్, మెటా వంటి ఇతర అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. అమెజాన్ తన బుక్స్, కిండిల్ విభాగాలతో పాటు పలు ఇతర టీమ్‌లలో వందమంది వరకూ ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 నుంచి ఇప్పటివరకు అమెజాన్ 27 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. జూన్‌లో దాదాపు 100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఏఐ, ఉద్యోగుల తొలగింపు సందర్భంగా కృతి వాసన్ మాటలను బట్టి ఉద్యోగులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని మేధస్సుకు పదును పెడినేతే మనుగడ సాధ్యమనే విషయం అర్థం అవుతోంది.
…………………………………………………