Tamilnadu IG Controversy
* చిన్నారి హత్యాచార కేసు ప్రెస్ మీట్లో ఐజీ నవ్వులు
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సులూర్ ప్రాంతంలో పదేళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష అత్యాచారం, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. మే 21న ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి.. మరుసటి రోజు కన్నంపాళయం చెరువు సమీపంలో శవమై తేలడం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రకటించిన నూతన ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్, ఈ ఘోరాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇస్తూ.. నిందితులపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
* 24 గంటల్లోనే నిందితుల వేట సినీ ఫక్కీలో అరెస్ట్…
సీఎం విజయ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేవలం 24 గంటల్లోనే నిందితులను గుర్తించాయి. బాధిత కుటుంబానికి సుపరిచితుడైన పొరుగు వ్యక్తి కార్తీ (33) బాలికను ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఇతనికి సహకరించిన మోహన్ రాజ్ (30) అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పైనుంచి దూకిన ప్రధాన నిందితుడు కార్తీ కాళ్లు, చేతులు విరగడంతో ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారు.
* ప్రెస్ మీట్లో ఐజీ రమ్య భారతి ప్రవర్తనపై దుమారం..
పోలీసులు కేసును వేగంగా ఛేదించినప్పటికీ.. ఈ కేసు వివరాలను వెల్లడించేందుకు పశ్చిమ జోన్ ఐజీ ఆర్.వి. రమ్య భారతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఒక పదేళ్ల చిన్నారి దారుణ హత్య గురించి వివరిస్తూ సదరు మహిళా ఐపీఎస్ అధికారిణి ముఖంలో నవ్వులు చిందించడం, చాలా క్యాజువల్‌గా గోళ్లు రుద్దుకుంటూ మాట్లాడటంపై నెటిజన్లు, ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. “బాధిత తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉంటే శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక ఉన్నత స్థాయి మహిళా అధికారి ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఏంటి?” అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
* తదుపరి యాక్షన్…
మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి ఈ వివాదం ఒక సవాలుగా నిలిచింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఐజీ రమ్య భారతిని వెంటనే సస్పెండ్ చేయాలని లేదా తక్షణమే లూప్ లైన్‌కు బదిలీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజా వ్యతిరేకత తీవ్రమవ్వడంతో, ఈ ప్రెస్ మీట్ వ్యవహారంపై హోంశాఖ ఇప్పటికే అంతర్గత నివేదిక కోరినట్లు సచివాలయ వర్గాల సమాచారం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని సంకేతాలిచ్చిన సీఎం విజయ్.. సదరు అధికారిణిపై త్వరలోనే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
