How Ants Detect Sweet Food
ఆకేరు న్యూస్ డెస్క్: మనం ఇంట్లో ఎంత దాచిపెట్టినా, ఒక్క బెల్లం ముక్కో లేదా పంచదార గింజో కింద పడితే చాలు… ఎక్కడి నుంచో వందలాది చీమలు క్షణాల వ్యవధిలో అక్కడ వాలిపోతాయి. వాటికి కళ్ళు అంత పదునా? లేక మనకంటే ముందే వాటికి స్వీట్స్ అంటే అంత ఇష్టమా? అసలు ఈ చిన్నారి జీవులు అంత ఖచ్చితంగా తీపి పదార్థాలను ఎలా పసిగడుతున్నాయి? దీని వెనుక ఉన్న ప్రకృతి రహస్యాలు, ఆసక్తికరమైన శాస్త్రీయ విశేషాలు ‘ఆకేరు న్యూస్’ ప్రత్యేక పరిశోధనాత్మక కథనంలో…
* చీమల అసాదరణ శరీర నిర్మాణం (Biological Marvel)
ప్రకృతి సృష్టించిన జీవుల్లో చీమల శరీర నిర్మాణం, వాటి శారీరక సామర్థ్యం ఒక పెద్ద వింత. ఒక సాధారణ చీమ తన శరీర బరువు కంటే 20 నుండి 50 రెట్లు ఎక్కువ బరువును చాలా సులభంగా మోయగలదు. చీమలకు మనలాంటి ఊపిరితిత్తులు ఉండవు. వాటి శరీరంపై ఉండే సూక్ష్మ రంధ్రాల (Spiracles) ద్వారా శ్వాస తీసుకుంటాయి. వీటికి చెవులు కూడా ఉండవు, నేలపై వచ్చే ప్రకంపనల (Vibrations) ఆధారంగానే శబ్దాలను గ్రహిస్తాయి. చీమల శరీరంలో రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి వాటి సొంత జీర్ణక్రియ కోసం ఉపయోగపడితే, మరొకటి (Social Stomach) ఆహారాన్ని నిల్వ చేసి, కాలనీలోని ఇతర చీమలకు పంచడానికి తోడ్పడుతుంది.
* చీమలకు ముక్కు ఉండదు.. మరి ఎలా పసిగడతాయి?
మానవులకు ముక్కు ఉన్నట్టు చీమలకు ముక్కు ఉండదు. కానీ, వాటి తలపై ఉండే యాంటెన్నాలు (Antennae) లేదా స్పర్శశృంగాలు వాటికి ముక్కు, నోరు, చేతులు అన్నీను కెమోరిసెప్టర్లు (Chemoreceptors) చీమల యాంటెన్నాలపై వేలాది సూక్ష్మమైన రసాయన గ్రాహకాలు (Chemoreceptors) ఉంటాయి. ఇవి గాలిలో తేలియాడే అత్యంత సూక్ష్మమైన రసాయన అణువులను కూడా గుర్తించగలవు. పంచదార, బెల్లం, లేదా పండ్ల రసాల నుండి వెలువడే రసాయన అణువులను ఈ యాంటెన్నాలు క్షణాల్లో ఒడిసిపట్టుకుని, చీమ మెదడుకు సంకేతాలు పంపుతాయి.
* ‘స్కౌట్’ చీమల శోధన – అన్వేషణ ప్రయాణం
చీమల కాలనీ (పుట్ట)లో శ్రమ విభజన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహారాన్ని వెతకడానికే కొన్ని ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని ‘స్కౌట్ చీమలు’ (Scout Ants) అంటారు. ఇవి ఉదయాన్నే పుట్టలోంచి బయలుదేరి నలుదిక్కులా ఆహారం కోసం అన్వేషిస్తాయి.వాటి యాంటెన్నాలను గాలిలో ఊపుతూ, ఎక్కడైనా తీపి వాసన వస్తుందేమోనని నిరంతరం శోధిస్తాయి. ఒకసారి తీపి పదార్థం దొరకగానే, అవి వెంటనే దాన్ని తినవు. ఆ సమాచారాన్ని తమ కాలనీకి చేరవేయడమే వాటి మొదటి లక్ష్యం.
* ఫెరోమోన్స్ (Pheromones): చీమల ‘గూగుల్ మ్యాప్స్
స్కౌట్ చీమకు తీపి పదార్థం దొరికిన తర్వాత, అది తన పుట్టకు తిరిగి వెళ్లేటప్పుడు నేలపై ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని విడుదల చేస్తూ వెళ్తుంది. ఈ రసాయనాన్ని ఫెరోమోన్స్ (Pheromones) అంటారు. ఈ ఫెరోమోన్ వాసనను బట్టి మిగిలిన కూలి చీమలు దారి తప్పకుండా, సరిగ్గా ఆ స్వీట్ ఉన్న చోటకే లైన్ కట్టి వస్తాయి. ఆహారం ఎంత ఎక్కువగా ఉంటే, చీమలు అంత ఎక్కువగా ప్రయాణిస్తాయి, దానివల్ల ఆ దారిలో ఫెరోమోన్ వాసన అంత గాఢంగా (Strong గా) మారి, మరిన్ని చీమలను ఆకర్షిస్తుంది.
* చీమలకు తీపి అంటే ఎందుకు అంత ఇష్టం?
చీమలు కేవలం రుచి కోసం తీపిని వెతకవు. వాటి మనుగడకు తీపి చాలా అవసరం. ఇన్స్టంట్ ఎనర్జీ (Instant Energy) తీపి పదార్థాలలో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ అధికంగా ఉంటాయి. నిరంతరం కష్టపడే కూలి చీమలకు తక్షణ శక్తిని ఇవ్వడానికి గ్లూకోజ్ ఎంతో అవసరం. పుట్టలో ఉండే రాణి చీమకు, లార్వాలకు (పిల్ల చీమలకు) పోషకాలు అందించడానికి ఈ చక్కెర నిధులు ఇంధనంగా ఉపయోగపడతాయి.
* దూరాన్ని, దిశను లెక్కించే అద్భుత జీవులు
చీమలు కేవలం వాసన మాత్రమే కాదు, తాము వెళ్లేటప్పుడు ఎన్ని అడుగులు వేశామో కూడా లెక్కపెట్టుకోగలవు (Pedometer ప్రక్రియ). సూర్యుని స్థానాన్ని బట్టి కూడా అవి దిశలను గుర్తిస్తాయి. కాబట్టి, ఒకసారి స్వీట్ ఎక్కడ ఉందో తెలిస్తే, ఆ మార్గాన్ని అవి చాలా సులువుగా గుర్తుపెట్టుకుంటాయి.
* కాలనీ నిర్మాణం – నిస్వార్థమైన వ్యక్తిత్వం
చీమలు ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సామ్రాజ్యంగా నివసిస్తాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి కాలనీకి ఒకే ఒక రాణి చీమ ఉంటుంది. దీని ప్రధాన విధి కేవలం గుడ్లు పెట్టడం, సామ్రాజ్యాన్ని విస్తరించడం మాత్రమే. ఇక కూలి చీమలు (Worker Ants) ఇవన్నీ ఆడ చీమలే. పుట్టను నిర్మించడం, ఆహారాన్ని (తీపిని) సేకరించడం, రాణి చీమను, పిల్లలను (లార్వాలను) సంరక్షించడం, శత్రువుల నుండి పుట్టను కాపాడటం వంటి పనులన్నీ ఇవే చేస్తాయి.
మగ చీమలు (Drone Ants) వీటికి కాలనీలో చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇవి రాణి చీమతో జతకట్టిన కొద్ది రోజులకే మరణిస్తాయి. చీమల నిఘంటువులో ‘సోమరితనం’ ఉండదు. నిరంతరం కష్టపడే గుణం, వర్షాకాలం కోసం ఎండకాలంలోనే ఆహారాన్ని దాచుకునే ‘ముందుచూపు’, తన కోసం కాకుండా తన సమాజం కోసం బతికే ‘నిస్వార్థ గుణం’ చీమల సొంతం.
* బాధ్యతను బట్టి ఆయుష్షు
అన్ని చీమల జీవితకాలం ఒకేలా ఉండదు. వాటి బాధ్యతలను బట్టి ఆయుష్షు మారుతుంది.
రాణి చీమ ఆయుష్షు కీటకాల ప్రపంచంలోనే అత్యధిక కాలం బతికే జీవుల్లో రాణి చీమ ఒకటి. ఇది దాదాపు 15 నుండి 30 సంవత్సరాల వరకు జీవించగలదు.కూలి చీమల ఆయుష్షు నిరంతరం శ్రమించే కూలి చీమలు, సైనిక చీమలు వాటి జాతిని బట్టి కొన్ని వారాల నుండి 1 నుండి 3 సంవత్సరాల వరకు జీవిస్తాయి. మగ చీమల ఆయుష్షు వీటి జీవితకాలం అత్యంత స్వల్పం. ఇవి కేవలం కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు మాత్రమే బతుకుతాయి.
————————————————————–
