MLA Padi Kaushik Reddy Ethics Committee
* ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం
* ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై విచారణ
* కౌంటర్ అటాక్ చేసిన బీఆర్ ఎస్
* సీఎం సహా మంత్రుల తీరుపై ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. అసెంబ్లీలో సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు, పాటించాల్సిన విలువలు, సభా మర్యాదల ఉల్లంఘన ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభలో అనుసరించిన తీరుపై ప్రధాన చర్చ జరిగింది.
* ఈ భేటీకి కారణం ఏంటంటే..
మార్చి 29న జరిగిన అసెంబ్లీ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత బడ్జెట్ సమావేశాల్లో ధరణి అక్రమాలు, భూ వ్యవహారాలపై చర్చ సందర్భంగా కడియం ప్రసంగించారు. ఆయన పార్టీ మారడాన్ని నిరసిస్తూ బీఆర్ ఎస్ ఆందోళన చేపట్టింది. ఆ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి దళిత ఎమ్మెల్యేను అవమానించేలా మాట్లాడారని కాంగ్రెస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. గన్తో కాల్చేస్తానంటూ చేతి వేళ్లు చూపారంటూ ఆరోపించింది. ఒక సీనియర్ దళిత ప్రజాప్రతినిధిపై బెదిరింపు ధోరణి ప్రదర్శించడం సరికాదని సీఎం రేవంత్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. వీడియో ఫుటేజీలు పరిశీలించి ఆయన వ్యవహార శైలిపై విచారణ జరపాలన్నారు.
* ఎథిక్స్ కమిటీకి బదిలీ
శాసనసభలో ప్రజాప్రతినిధిగా సభా హక్కులను, నైతిక నియమావళిని కౌశిక్ రెడ్డి పూర్తిగా ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన స్పీకర్, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి బదిలీ చేశారు. ఈ మేరకు నేడు ఎథిక్స్ కమిటీ సమావేశమైంది. వివాదానికి కేంద్రబిందువైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా హాజరై కమిటీ ముందు తన వివరణను లిఖితపూర్వకంగా సమర్పించారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, ముఠా గోపాల్ తదితరులు అసెంబ్లీకి తరలివచ్చారు.
* బీఆర్ ఎస్ ఎదురుదాడి
బీఆర్ఎస్ నుంచి ఎథిక్స్ కమిటీలో ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పద్మారావు ఉన్నారు. కౌశిక్ రెడ్డి తరఫున వారు తమ వాదనలను బలంగా వినిపించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఈ విచారణను రాజకీయ కక్షసాధింపు చర్యగా వారు అభివర్ణించారు. గత సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలనుద్దేశించి “బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొడతాం”, “జూబ్లీ బస్ స్టాండ్ లో అడుక్కుంటారు” అని చేసిన వ్యాఖ్యలను వారు కమిటీ దృష్టికి తెచ్చారు. ఆ వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గతంలో సభలో కత్తి యుద్ధాలు చేస్తామంటూ చేసిన సైగలు, అనుచిత వ్యాఖ్యలపై కూడా మొదట విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
* సమావేశాల్లో నివేదిక?
అనంతరం ఎథిక్స్ కమిటీ కాంగ్రెస్ సభ్యులతో కూడా భేటీ కానున్నారు. కమిటీ తన పూర్తి స్థాయి నివేదికను, సిఫార్సులను త్వరలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అందజేయనుంది. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే ఎథిక్స్ కమిటీ నివేదికను సభ ముందు ఉంచే అవకాశం ఉంది. నివేదికలో తప్పు రుజువైతే, కౌశిక్ రెడ్డిపై సస్పెన్షన్ లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే దిశగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
