Kadiyam Srihari Comments on Polytechnic Education
* జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్
* ప్రభుత్వం స్పందించాలి
* ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
పాలిటెక్నిక్ విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97పై పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యం మంచిదేనని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. అయితే, దేశవ్యాప్తంగా అమలవుతున్న విధానాలకు అనుగుణంగానే తెలంగాణలో కూడా పాలిటెక్నిక్ విద్య కొనసాగాలని సూచించారు.
* జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన కడియం శ్రీహరి
పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ వ్యవస్థను లేబర్ శాఖ పరిధిలోకి మార్చడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం గుర్తించి వారి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు
ఇటీవల పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.
శక్తి స్కీం పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానించే ప్రయత్నం తమ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే ఆందోళనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.
జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో పాలిటెక్నిక్ విద్య అంశం రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. సమస్యపై అధ్యయనం చేసి సూచనలు చేయడానికి కే. కేశవరావు నేతృత్వంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
* ప్రభుత్వం స్పందించాలన్న కడియం
రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కడియం శ్రీహరి స్వయంగా పాలిటెక్నిక్ విద్యా విధానంపై పునరాలోచించాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో తొందరపాటు నిర్ణయాలకు బదులుగా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేస్తూనే, విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు మరియు ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కడియం శ్రీహరి వ్యాఖ్యలు రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చకు దారితీశాయి.
జీవో 97పై కొనసాగుతున్న వివాదానికి ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందో, హైలెవల్ కమిటీ ఏ సూచనలు చేస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
