cm Revanth Reddy Letter to Election Commission on SIR
* గడువు పెంచాలని రేవంత్ వినతి
* 73.39 లక్షల ఎంట్రీలపై ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించే గడువును మరికొన్ని వారాలు పొడిగించాలని ఈసీని కోరారు. ప్రస్తుతం క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలుకు సెప్టెంబర్ 16 వరకు గడువు ఉంది. ఈ గడువును మరికొంత కాలం పొడిగించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించిన గడువును కూడా పొడిగించాలని కోరారు.
* 73.39 లక్షల ఎంట్రీలపై సీఎం ఆందోళన..
SIR ప్రక్రియలో భాగంగా 73.39 లక్షల ఎంట్రీలు ASDD కేటగిరీలో ఉన్నాయని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. వీరిలో కొందరు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండే అవకాశం ఉందని తెలిపారు.
తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని శాశ్వతంగా తరలివెళ్లిన వారిగా పరిగణించే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీని కోరారు. అర్హులైన ఓటర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* కొత్త చిరునామాలో నమోదుకు సాయం..
తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లకు కొత్త చిరునామాలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని సీఎం సూచించారు. అలాగే ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు తగినంత సమయం ఇవ్వాలని కోరారు. ప్రతి అర్హుడైన ఓటరుకు తన అభ్యంతరాలు, వివరాలను సమర్పించుకునే అవకాశం ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
* ERO స్థాయిలో సిబ్బంది పెంపు..
SIR ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) స్థాయిలో సిబ్బందిని మరింత పెంచాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. పెద్ద సంఖ్యలో ఉన్న క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిశీలించేందుకు అదనపు సిబ్బంది అవసరమని పేర్కొన్నారు. SIR ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
