Sri Krishnashtami Celebrations in Warangal
* విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ పిలుపు
* అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం
* ఢిల్లీ నుంచి యాదవ సామాజిక నేతలు
అకేరు న్యూస్, వరంగల్: శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 4న జరగనున్న శ్రీకృష్ణ ష్టమి వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు.
హనుమకొండ రామ్‌నగర్‌లోని బీసీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా శ్రీకృష్ణ ష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచానికి శ్రీకృష్ణుడు మార్గదర్శకుడని, ఆయన బోధనలు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.
దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా శ్రీకృష్ణుడి గొప్పతనం, భగవద్గీత సందేశాలకు విస్తృత గుర్తింపు లభిస్తోందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.
* భజనలు.. భగవద్గీత పఠనం
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ భజనలు, భగవద్గీత పఠనం సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి అందులోని జీవన విలువలను ఆచరించాలని సుందర్ రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా భగవద్గీత బోధనల నుంచి స్ఫూర్తి పొంది తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
* కాళోజీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమలు
సెప్టెంబర్ 4న కాళోజీ కళాక్షేత్రంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. యాదవ కళాకారుల ప్రత్యేక ప్రదర్శనలు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గొల్ల కురుమలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హిందూ, ముస్లిం, క్రైస్తవులతో సహా అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా, ప్రశాంతంగా జీవించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
* మధ్యాహ్నం 2 గంటలకు రధయాత్ర
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 2 గంటలకు రామ్‌నగర్ నుంచి ఘనంగా రాధాయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేక గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శ్రీకృష్ణుడితో ముడిపడిన గోసంస్కృతికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
* అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం
శ్రీకృష్ణుడి దీవెనలు పొందేందుకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, వినయ్ భాస్కర్, బండ ప్రకాష్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
* ఢిల్లీ నుంచి యాదవ సామాజిక నేతలు
ఈ వేడుకలకు ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాదవ సామాజిక నేతలు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న యాదవులను ఏకం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
నీతి, నిజాయితీకి యాదవులు మారుపేరని, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.
* జనగామలోనూ శ్రీకృష్ణ ఉత్సవాలు
జనగామలో కూడా శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మకుంట నుంచి రాధాయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ కార్యక్రమం అనంతరం అక్కడి ప్రతినిధులు, భక్తులు ప్రధాన వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణ అష్టమి వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను యాదవ నాయకులు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 4న జరగనున్న అష్టమి వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
