* స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి పదేళ్లు
* అంగరంగవైభవంగా సంబరాలు
* అమరుల కుటుంబాలకు సత్కారాలు
* ఘనంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్ డెస్క్ :
ఎందరో బలిదానాల త్యాగం..
మరెందరో ఉద్యమకారుల పోరాట ఫలం..
జై తెలంగాణ అంటూ నినదించిన జనం..
కదం తొక్కి.. పదం కలిపి.. పిడిగిలి బిగించి.. ఢిల్లీ పీఠాన్ని కదిలించి.. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి నేటితో పదేళ్లు.
ఈక్రమంలో రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ఆనాటి స్మృతులను నెమరవేసుకుంటోంది.
ఉద్యమంలో కీలక ఘట్టాలు
‘ఆ చల్లని సముద్ర గర్భం.. దాగిన బడబానలమెంతో… భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో..‘‘ అన్నారు ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య. అలాగే.. తెలంగాణ రాష్ట్ర అవతరణ వెనుక పాటై నినదించిన గొంతుకలు, ప్రశ్నించిన గళాలు చాలానే ఉన్నాయి. ఆత్మగౌరవ నినాదాన్ని గొంతెత్తి చాటి.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారు. భారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర పోరాటానంతరం విజయవంతమైన ప్రజా పోరాటంగా తెలంగాణ ఉద్యమం ఖ్యాతికెక్కింది. మలిదశ పోరాటానికి 1997, మార్చి8,9ల నాటి భువనగిరి బహిరంగ సభ తొలి ప్రేరణ అంటారు తెలంగాణ ఉద్యమకారులు. ఆసభ ద్వారానే ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి.
శ్రీకాంతాచారి బలిదానం.తో..
జై తెలంగాణ అని నినదిస్తూ 2009 నవంబర్ 29న మంటల్లో తాను కాలిపోతూ.. డిసెంబర్ 3న ఊపిరి వదిలిన శ్రీకాంతాచారి బలిదానంతో ఉద్యమ తీవ్రత పెరిగింది. 2011, సెప్టెంబరు13న ప్రారంభమై 42 రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మె, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి పిలుపుతో సాగరహారం, ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్, వంటావార్పు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారాయి. 2011, మార్చి10న ట్యాంక్‌బండ్‌పై సాగిన మిలియన్ మార్చ్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి తెలిసేలా చేసింది.
అమరుల కుటుంబాలకు సత్కారం నేడు
ఆనాటి స్మృతులను జ్ఞప్తికి చేసుకుంటూ.. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను నేడు కాంగ్రెస్ సర్కారు సత్కరించనుంది. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను, మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్నవారి కుటుంబాలను ఈమేరకు ఆహ్వానించింది. 650 మంది అమరుల కుటుంబాలను ఉత్సవానికి ఆహ్వానించారు. వీరందరికీ సముచిత స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రం కోసం చోటుచేసుకున్న ప్రాణత్యాగాలను గుర్తు చేసుకోబోతోంది. స్వయం సహాయక బృందాల మహిళలను కూడా ఆహ్వానించి, ఉద్యమంలో మహిళల పాత్రను ప్రభుత్వం వివరించనుంది.
———————